‘లక్ష కోట్ల’ కంపెనీలు జూమ్‌

2 Sep, 2021 06:17 IST|Sakshi

ప్రస్తుతం 47ను తాకిన సంఖ్య

2021లో 19 కంపెనీలు జత

మార్కెట్‌ విలువ జాబితా జోరు

మార్కెట్లలో బుల్‌ జోష్‌ ఎఫెక్ట్‌

ఆర్‌ఐఎల్, టీసీఎస్‌.. పోటాపోటీ

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విడిచిపెట్టనప్పటికీ స్టాక్‌ మార్కెట్లు లెక్కచేయడం లేదు. ప్రధానంగా దేశీ స్టాక్‌ ఇండెక్సులు రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లకు జతగా రిటైల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూ కట్టడం లిస్టెడ్‌ కంపెనీలకు జోష్‌నిస్తోంది. ఫలితంగా బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) 250 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది. దీంతో మార్కెట్‌ క్యాప్‌లో రూ. లక్ష కోట్ల విలువను అందుకుంటున్న కంపెనీలు పెరుగుతున్నాయ్‌! వివరాలు చూద్దాం..

ముంబై: గతేడాది మార్చిలో విరుచుకుపడిన కోవిడ్‌–19తో స్టాక్‌ మార్కెట్లకు షాక్‌ తగిలినప్పటికీ తిరిగి వెనువెంటనే నిలదొక్కుకున్నాయి. ఆపై భారీ లిక్విడిటీ, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు మార్కెట్లకు హుషారునిచ్చాయి. ఇటీవల రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం రికార్డులు స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటంతో సెంటిమెంటు మరింత బలపడింది. ఈ ప్రభావంతో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ తాజాగా(ఆగస్ట్‌ 31కల్లా) 57,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. మరోపక్క ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 17,000 పాయింట్ల మార్క్‌ను సులభంగా దాటేసింది. ఈ ప్రభావంతో పలు లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ మెరుగుపడుతోంది. వెరసి తాజాగా రూ. లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన కంపెనీల జాబితా 47కు చేరింది. 2021లోనే కొత్తగా 19 కంపెనీలు జత కలవడం విశేషం!  

కొనసాగిన జాబితా  
మార్కెట్‌ విలువ రీత్యా గతేడాది(2020) రూ. లక్ష కోట్ల క్లబ్‌లో 28 సంస్థలు చోటు సాధించాయి. ఈ బాటలో కొత్తగా టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్‌ మహీంద్రా, బీపీసీఎల్, డాబర్, గోద్రెజ్‌ కన్జూమర్‌ తదితరాలు చేరాయి. వీటితోపాటు గతేడాది ఈ జాబితాలో గల కంపెనీలు కూడా తమ పొజిషన్లను నిలుపుకోవడం గమనించదగ్గ అంశం! యూఎస్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ప్యాకేజీలు అమలు చేయడంతో పెరిగిన లిక్విడిటీ, దేశీ ఆర్థిక వ్యవస్థపట్ల బలపడుతున్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.  

పీఎస్‌యూలు సైతం
ఏడాది కాలాన్ని పరిగణిస్తే సెన్సెక్స్‌ 20 శాతం పుంజుకోగా.. ప్రభుత్వ రంగ సంస్థల ఇండెక్స్‌ 32 శాతం ఎగసింది. దీంతో రూ. ట్రిలియన్‌ విలువైన పీఎస్‌యూ దిగ్గజాల జాబితాలో ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ జత కలిశాయి. ప్రభుత్వ బ్లూచిప్‌ కంపెనీలు స్టేట్‌బ్యాంక్, ఓఎన్‌జీసీ ఇప్పటికే జాబితాకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విదితమే. కాగా.. ఇటీవల మార్కెట్‌ విలువలో ఎస్‌బీఐ 49 శాతం, ఓఎన్‌జీసీ 24 శాతం చొప్పున జంప్‌ చేశాయి. ట్రిలియన్‌ క్లబ్‌లో చేరిన పీఎస్‌యూలు.. వేల్యూ స్టాక్స్‌కు లభిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్, పునరుత్పాదక ఇంధనాలకు డిమాండ్‌ సైతం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు.  

అదానీ, టాటాల స్పీడ్‌
రూ. ట్రిలియన్‌ మార్కెట్‌ క్యాప్‌ క్లబ్‌లో ఐదు కంపెనీల ద్వారా అదానీ గ్రూప్‌ అగ్రస్థానం వహిస్తోంది. ఈ బాటలో టాటా గ్రూప్‌ సైతం నాలుగు కంపెనీలతో రెండో ర్యాంకును ఆక్రమించింది. అయితే విడిగా విలువ రీత్యా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(రూ. 14.32 లక్షల కోట్లు), టీసీఎస్‌(రూ. 14 లక్షల కోట్లు) తొలి రెండు ర్యాంకులలో నిలుస్తున్నాయి. ఈ ఏడాది మార్కెట్‌ విలువను భారీగా జమ చేసుకున్న కంపెనీలలో టీసీఎస్‌(రూ.2.8 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్‌(రూ. 2 ట్రిలియన్లు), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(రూ. 1.7 లక్షల కోట్లు), విప్రో(రూ. 1.2 లక్షల కోట్లు) ఆధిపత్యం వహిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు