పీఎస్‌యూల ఆస్తుల విక్రయానికి ఈ–ప్లాట్‌ఫార్మ్‌..!

8 Jan, 2021 05:46 IST|Sakshi

ఎలక్ట్రానిక్‌–ప్లాట్‌ఫార్మ్‌ ఏర్పాటు చేస్తున్న కేంద్రం 

ఈ ప్లాట్‌ఫార్మ్‌ ఏర్పాటు బాధ్యత ఎమ్‌ఎస్‌టీసీకి  సమన్వయం చేయనున్న దీపమ్‌

నెలరోజుల్లో అందుబాటులో బడ్జెట్‌లో ప్రతిపాదన  

ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూల)లకు కీలకం కాని, నిరుపయోగంగా ఉన్న భూములు, ఆస్తుల విక్రయానికి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫార్మ్‌ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆస్తుల నగదీకరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద మిగులుగా ఉన్న భూములు, ఆస్తులను కేంద్రం విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆస్తులకు సంబంధించి కొన్నింటికి న్యాయ వివాదాలు ఉండటం, ఇతరత్రా కారణాల వల్ల ఈ ఆస్తుల విక్రయం ఆశించినంతగా ఉండటం లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి, సత్వరంగా ఆస్తులను విక్రయించడానికి   ఆన్‌లైన్‌–ప్లాట్‌ఫార్మ్‌ను ఏర్పాటు చేయడమే సరైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలనేది కేంద్రం ఆలోచన.  

ఈ–ప్లాట్‌ఫార్మ్‌పై బడ్జెట్‌లో ప్రకటన!  
పీఎస్‌యూలకు సంబంధించి కీలకం కాని ఆస్తులను విక్రయించడానికి ఈ–బిడ్డింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ను రూపొందించాలని కేంద్రం ఇటీవలనే ప్రభుత్వ రంగ సంస్థ, ఎమ్‌ఎస్‌టీసీని ఆదేశించిందని సమాచారం. పీఎస్‌యూల భూములు, ఆస్తులకు సంబంధించి ఈ ప్లాట్‌ఫార్మ్‌.. వన్‌–స్టాప్‌ షాప్‌గా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్లాట్‌ఫార్మ్‌ ఏర్పాటుకు కనీసం నెల రోజులు పడుతుందని, దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఉండే అవకాశాలున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాట్‌ఫార్మ్‌కు దీపమ్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) సమన్వయ సహకారాలనందిస్తుంది. వ్యూహాత్మక వాటా విక్రయానికి ఉద్దేశించిన పీఎస్‌యూల ఆస్తులను తొలుతగా ఈ ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా విక్రయించే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే కొన్ని ఆస్తులను గుర్తించారు.  బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్, బీఈఎమ్‌ఎల్‌ తదితర సంస్థల ఆస్తులు దీంట్లో ఉన్నాయి.  

డిజిటల్‌ టెక్నాలజీ ఉత్తమం....
కీలకం కాని, వృ«థాగా ఉన్న పీఎస్‌యూల భూములను, ఆస్తులను విక్రయించాలని గత కొన్నేళ్లుగా పీఎస్‌యూలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. న్యాయ సంబంధిత వివాదాలు, ఇతరత్రా కారణాల వల్ల పీఎస్‌యూలు ఈ ఆస్తుల విక్రయంలో విఫలమవుతున్నాయి. ఈ వ్యవహారం ఒకడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కు.. అన్న చందంగా తయారైంది. ఇలాంటి ఆస్తుల విక్రయానికి డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

ఈ ప్లాట్‌ఫార్మ్‌ ఎలా పనిచేస్తుందంటే..
► ఈ–బిడ్డింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ ఏర్పాటు చేస్తారు  
► విక్రయించే పీఎస్‌యూల భూములు, ఆస్తులను ఈ ప్లాట్‌ఫార్మ్‌పై నమోదు చేస్తారు  
► ఎమ్‌ఎస్‌టీసీ, దీపమ్‌ల పర్యవేక్షణ ఉంటుంది  
► రూ.100 కోట్లకు మించిన ఆస్తులనే అమ్మకానికి పెడతారు.
► వేలంలో పాల్గొనే సంస్థలు ఎమ్‌ఎస్‌టీసీ వద్ద నమోదు చేసుకోవాలి  
► అసెట్‌ వేల్యూయార్‌చే ఆస్తుల విలువ నిర్ధారిస్తారు  
► ఆస్తుల కొనుగోళ్లకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్‌లు  ఆహ్వానిస్తారు  
► ఈ–వేలం నిర్వహిస్తారు  
► వేలం అనంతర ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు  

మరిన్ని వార్తలు