ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.8,666 కోట్లు

9 Sep, 2021 03:00 IST|Sakshi

ఆగస్ట్‌లోనూ సిప్‌ పెట్టుబడుల్లో స్థిరత్వం

సిప్‌ రూపంలో వచ్చింది

రూ.9,923 కోట్లు

రూ.36.6 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఏయూఎం

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈక్విటీ పథకాలు ఆగస్ట్‌ నెలలో నికరంగా రూ.8,666 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. నూతన ఫండ్‌ పథకాల ఆవిష్కరణ (ఎన్‌ఎఫ్‌వోలు), సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేశాయి. ఇలా ఈక్విటీ పథకాల్లోకి సానుకూల పెట్టుబడులు ప్రవేశించడం వరుసగా ఆరో నెలలోనూ నమోదైంది.

అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఆగస్ట్‌ చివరికి రూ.36.6 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది జూలై ఆఖరుకు రూ.35.32 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) ఆగస్ట్‌ నెలకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది జూలైలో రూ.22,583 కోట్లు, జూన్‌లో రూ.5,988 కోట్లు, మేలో రూ.10,083 కోట్లు, ఏప్రిల్‌లో రూ.3,437 కోట్లు, మార్చిలో రూ.9,115 కోట్ల చొప్పున పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి రావడం గమనార్హం. 2020 జూలై– 2021 ఫిబ్రవరి మధ్య ఎనిమిది నెలల పాటు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి.

నూతన మైలురాయి..
‘‘ఓపెన్‌ ఎండెడ్‌ పథకాల్లోని సానుకూల పెట్టుబడుల రాకకుతోడు.. ఈక్విటీ మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరుకోవడం మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని నికర ఏయూఎం రూ.36 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించేందుకు తోడ్పడ్డాయి’’ అని యాంఫి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు. సిప్‌ ఖాతాలు పెరగడం అన్నది ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో సంపద సృష్టికి మ్యూచువల్‌ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఆగస్ట్‌లో ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలలో ఇన్వెస్టర్లు రూ.6,863 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు మైవెల్త్‌గ్రోత్‌ సహ వ్యవస్థాపకుడు హర్షద్‌ చేతన్‌వాలా పేర్కొన్నారు.

విభాగాల వారీగా...
► ఫ్లెక్సీక్యాప్‌ విభాగం అత్యధికంగా రూ.4,741 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.
► ఫోకస్డ్‌ ఫండ్స్‌ విభాగంలోకి రూ.3,073 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  
► మల్టీక్యాప్, లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల నుంచి ఆగస్ట్‌లో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ముఖ్యంగా స్మాల్‌క్యాప్‌ పథకాల నుంచి ఆగస్ట్‌లో ఇన్వెస్టర్లు రూ.163 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
► హైబ్రిడ్‌ ఫండ్స్‌లోనూ ఇన్వెస్టర్లు రూ.18,706 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు.  
► సిప్‌ ఖాతాలు జూలై ఆఖరుకు 4.17 కోట్లుగా ఉంటే, ఆగస్ట్‌ చివరికి 4.32 కోట్లకు పెరిగాయి.
► నెలవారీ సిప్‌ పెట్టుబడులు రూ.9,923 కోట్లుగా ఉన్నాయి. జూలైలో ఈ మొత్తం రూ.9,609 కోట్లుగా ఉంది.
► గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.24 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో మాత్రం ఈ విభాగం నుంచి ఇన్వెస్టర్లు రూ.61 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
► ఆగస్ట్‌లో డెట్‌ పథకాల్లోకి నికర పెట్టుబడులు రూ.1,074 కోట్లుగానే ఉన్నాయి. జూలైలో వచి్చన రూ.73,964 కోట్లతో పోలిస్తే డెట్‌లోకి పెట్టుబడులు గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది.  
► డెట్‌లో ఫ్లోటర్‌ ఫండ్స్‌లోకి రూ.9,991 కోట్లు, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌లోకి రూ.3,065 కోట్ల చొప్పున వచ్చాయి.  
► లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి నికరంగా రూ.11,808 కోట్లను ఉపసంహరించుకున్నారు.
► ఆగస్ట్‌లో  ఫండ్స్‌ పరిశ్రమలోకి (అన్ని విభాగాలూ) నికరంగా రూ.32,976 కోట్లు వచ్చాయి.

మరిన్ని వార్తలు