మ్యూచువల్‌ ఫండ్స్‌కి బ్రేక్‌!

11 Aug, 2020 01:17 IST|Sakshi

ఈక్విటీ పథకాల నుంచి పెట్టుబడులు బయటకు

నాలుగేళ్ల తర్వాత మొదటి సారి ఈ పరిస్థితి

జూలైలో నికరంగా రూ.2,480 కోట్ల ఉపసంహరణ

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఆలోచనా ధోరణి మారినట్టుంది. దీనికి ప్రతిబింబంగా నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.2,480 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల ప్రచారం కారణంగా ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహనతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి ప్రతీ నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్న పరిస్థితి చూశాము.

కానీ కరోనా రాకతో ఈ పరిస్థితి మారిపోయింది. తగ్గిపోయిన ఆదాయాలు, అత్యవసర ఖర్చుల కోసమో లేక, ఈక్విటీ పథకాల పనితీరు నచ్చక ఇటీవల ర్యాలీ తర్వాత వచ్చినంత చాలనుకునే ధోరణితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. జూలై నెల గణాంకాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్ల తీరు ప్రస్ఫుటమవుతుంది. జూలైలో ఈక్విటీ పథకాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,480 కోట్లను ఉపసంహరించుకున్నారు.

2016 మార్చి నెలలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాల నుంచి రూ.1,370 కోట్లను వెనక్కి తీసుకోగా, ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది జూలైలో అదే పరిస్థితి కనిపించింది. అంతక్రితం జూన్‌ నెలలో ఈక్విటీ స్కీమ్‌ ల్లోకి రూ.240 కోట్ల మేర నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. ఇక అంతకుముందు నెలల్లో.. మేలో రూ.5,256 కోట్లు, ఏప్రిల్‌ నెలలో రూ.6,213 కోట్లు, మార్చిలో రూ.11,723 కోట్లు, ఫిబ్రవరిలో రూ.10,796 కోట్లు, జనవరిలో రూ.7,877 కోట్ల చొప్పున ఈక్విటీ పథకాలు నికరంగా పెట్టుబడులను ఆకర్షించాయి. అంటే 2020లో మొదటి ఐదు నెలలు ఈక్విటీ పథకాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు గత రెండు నెలల్లో అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది.
   
► జూలై మాసంలో ఫండ్స్‌ పరిశ్రమలోకి నికరంగా రూ.89,813కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. జూన్‌ నెలలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే రూ.7,625 కోట్లు అదనంగా వచ్చినట్టు. ప్రధానంగా డెట్‌ ఫండ్స్‌ లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. ఇందులో లిక్విడ్, లో డ్యురేషన్‌ ఫండ్స్‌ అధిక పెట్టుబడులను ఆకర్షించాయి.  

► మల్టీక్యాప్‌ ఫండ్స్‌ నుంచి రూ.1,033 కోట్లు, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ నుంచి రూ.579 కోట్లు, వ్యాల్యూ ఫండ్‌ విభాగం నుంచి రూ.549 కోట్ల చొప్పున బయటకు వెళ్లాయి.  

► స్థిరాదాయ పథకాలు లేదా డెట్‌ ఫండ్స్‌ లోకి జూన్‌ నెలలో కేవలం రూ.2,862 కోట్లు పెట్టుబడులే రాగా, జూలైలో రూ.91,392 కోట్ల మేర భారీగా ఇన్వెస్టర్లు డెట్‌ ఫండ్స్‌ లోకి కుమ్మరించారు. ఇందులో డ్యురేషన్‌ ఫండ్స్‌లోకి రూ.14,219 కోట్లు, లిక్విడ్‌ ఫండ్స్‌లోకి రూ.14,055 కోట్లు, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ లోకి రూ.11,910 కోట్లు, బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌ యూ ఫండ్స్‌ లోకి రూ.6,323 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ నుంచి రూ.670 కోట్లు బయటకు వెళ్లాయి.

► గోల్డ్‌ ఈటీఎఫ్‌ ల్లోకి రూ.921 కోట్లు నికరంగా పెట్టుబడులు వచ్చాయి.  

► జూలై ఆఖరుకు 45 సంస్థలతో కూడిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహలోని పెట్టుబడుల విలువ రూ.27.12 లక్షల కోట్లుగా ఉంది.

లాభాల స్వీకరణే..
ఈ ఏడాది జూలైలో ఈక్విటీ విభాగంలో ఈఎల్‌ఎస్‌ఎస్, ఫోకస్డ్‌ ఫండ్స్‌ మినహా మిగిలిన అన్ని విభాగాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చోటు చేసుకుంది. అయితే, దీన్ని లాభాల స్వీకరణగా యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ పేర్కొన్నారు. మల్టీక్యాప్, లార్జ్‌ క్యాప్‌ విభాగంలో లాభాలు స్వీకరించినట్టు చెప్పారు. తగ్గిన వడ్డీ రేట్ల కారణంగా మెరుగైన రాబడులతో డెట్‌ ఫండ్స్‌ ఆకర్షణీయంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు.

‘‘మల్టీక్యాప్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువగా పెట్టుబడుల ఉపసంహరణ నెలకొనగా, ఆ తర్వాత మిడ్క్యాప్, వ్యాల్యూ ఫండ్‌ విభాగాల్లో ఈ పరిస్థితి కనిపించింది’’ అని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరగడంతో లాభాలు స్వీకరించినట్టు చెప్పారు. ‘‘ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనం అనంతరం ఇన్వెస్టర్లు వచ్చిన లాభాలతో బయటకు వెళ్లిపోవడం సాధారణంగా కనిపించే ధోరణే. అయితే పరిణతి చెందిన ఇన్వెస్టర్లు మాత్రం తమ సిప్‌ పెట్టుబడులను కొనసాగించడంతో వాటి రాక పెరిగింది’’అని గ్రోవ్‌ సహ వ్యవస్థాపకుడు,సీవోవో జైన్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు