‘చకచకా చేయి’..యూరప్‌లోనూ యూపీఐ చెల్లింపులు

12 Oct, 2022 09:01 IST|Sakshi

న్యూఢిల్లీ: యూరప్‌కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐపీఎల్‌) యూరప్‌కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్‌లైన్‌’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్‌ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్‌ఐపీఎల్‌ ప్రకటించింది. 

యూరప్‌ లో భారతీయులు.. వరల్డ్‌లైన్‌కు చెందిన క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత మర్చంట్స్‌ పీవోఎస్‌ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేయడానికి వీలవుతుంది. అలాగే, రూపే డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులతోనూ యూరోప్‌లో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయులు అంతర్జాతీయ కార్డ్‌ నెట్‌వర్క్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్‌ మార్కెట్లను లక్ష్యంగా చేసుకోనున్నట్టు ఎన్‌ఐపీఎల్‌ తెలిపింది. వరల్డ్‌లైన్‌ క్యూఆర్‌ ద్వారా యూరప్‌లోని మరిన్ని దేశాల్లోకి యూపీఐని విస్తరించనున్నట్టు తెలిపింది.  

జీ20 దేశాలకు యూపీఐ, ఆధార్‌!
కాగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ డిజిటల్‌ సేవలు అందించేందుకు వీలుగా.. జీ 20 దేశాలు యూపీఐ, ఆధార్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసి, అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. విజ్ఞానం, ఆవిష్కరణ, స్థిరత్వం అన్నవి నూతనతరం ఆర్థిక వృద్ధి చోదకాలుగా పేర్కొన్నారు. 

భారత్‌ ఓపెన్‌ సోర్స్‌ ప్లాట్‌ ఫామ్‌లు అయిన కోవిన్, ఆధార్, యూపీఐ ఇంటర్‌ఫేస్‌ తదితర వాటిని సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో జైన్‌ మాట్లాడుతూ. ఈ తరహా ఓపెన్‌ సోర్స్‌ (మార్పులకు వీలైన), పలు వ్యవస్థల మధ్య పనిచేసే ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు