గందరగోళం సృష్టిస్తోంది..

1 Feb, 2021 00:46 IST|Sakshi

అమెజాన్‌పై ఫ్యూచర్‌ బియానీ ఆరోపణలు

రిలయన్స్‌ డీల్‌ అంశంపై ఉద్యోగులకు లేఖ

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో డీల్‌ విషయంలో మోకాలడ్డుతున్న అమెరికా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌పై ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ కిషోర్‌ బియానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు అక్కరకు రాని వ్యవహారంలో తలదూరుస్తూ అమెజాన్‌ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఉద్యోగులకు లేఖ రాశారు. అమెజాన్‌తో వివాదం విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు బియానీ ప్రయత్నం చేశారు.

‘అలెగ్జాండర్‌ యావత్‌ ప్రపంచాన్ని గెలిచినా.. భారత్‌లో విఫలమయ్యాడని చరిత్ర చెబుతోంది. భారతీయ వినియోగదారులకు అందిస్తున్న సేవలు, మీ అండతో దేశ ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్‌ గ్రూప్‌ చట్టబద్ధంగానే ముందుకు సాగుతోందని .. స్టాక్‌ ఎక్సే్చంజీలు, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి కూడా డీల్‌కు అనుమతులు పొందిందని పేర్కొన్నారు.   

లిటిగేషన్లతో వేధిస్తోంది ..అమెజాన్‌ ఒక ప్రణాళిక ప్రకారం మీడియాలో
దుష్ప్రచారం సాగిస్తోందని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని లీక్‌ చేస్తోందని కిషోర్‌ బియానీ ఆరోపించారు.   ఫ్యూచర్‌ రిటైల్, డైరెక్టర్ల బోర్డు, రుణదాతలతో పాటు తనతో పాటు తండ్రి, పిల్లలు, కుటుంబసభ్యులను కూడా విడిచి పెట్టడం లేదని పేర్కొన్నారు.  కరోనా వైరస్‌పరమైన ఆర్థిక సంక్షోభం కారణంగా రిలయన్స్‌ గ్రూప్‌తో నిర్మాణాత్మక డీల్‌ కుదుర్చుకోవడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్‌ గ్రూప్‌లోని అన్‌లిస్టేడ్‌ సంస్థ ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు 2019 ఆగస్టులో అమెజాన్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

దీని ప్రకారం ఫ్యూచర్‌ కూపన్స్‌కి వాటాలు ఉన్న ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థలో కొన్నేళ్ల తర్వాత అమెజాన్‌ కూడా వాటాలు కొనుగోలు చేయొచ్చు. అయితే, కరోనా దెబ్బతో రిటైల్‌ను రిలయన్స్‌కు సుమారు రూ. 24,713 కోట్లకు విక్రయించాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ నిర్ణయించుకోవడంతో వివాదం వచ్చి పడింది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ అమెజాన్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా .. దానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. మరోవైపు, ఫ్యూచర్‌ గ్రూప్‌.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నియంత్రణ సంస్థలు దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. ఒప్పంద ఉల్లంఘనకు గాను బియానీని అరెస్ట్‌ చేయడంతో పాటు ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అమెజాన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.   

మరిన్ని వార్తలు