త్వరలో ప్రభుత్వం నుంచి దేశీ అమెజాన్

28 Nov, 2020 12:28 IST|Sakshi

దేశీ ఈకామర్స్‌ సైట్‌ ఏర్పాటుకు సన్నాహాలు

విధానాల నిర్ణయానికి తాజాగా కమిటీ ఏర్పాటు

ఈకామర్స్‌ బిజినెస్‌లో లోపాల నివారణపై ప్రభుత్వం దృష్టి

న్యూఢిల్లీ, సాక్షి: ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రియులకు శుభవార్త! త్వరలో దేశీయంగా అమెజాన్‌ తరహా ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఆవిర్భవించనుంది. ఇందుకు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే నడుం బిగించడం విశేషం! ఇందుకు వీలుగా నిపుణులతో కూడిన ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. త్వరలో ఈ కమిటీ విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వెరసి ప్రభుత్వమే దేశీ ఈకామర్స్‌ బిజినెస్‌కు తెరతీయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తద్వారా ఈకామర్స్‌ రంగంలో జరుగుతున్న కొన్ని అక్రమాలకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్నళ్లుగా దేశంలో ఈకామర్స్‌ బిజినెస్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ వస్తోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కోవిడ్‌-19 దీనికి జత కలిసింది. దీంతో దేశీయంగా పండుగల సీజన్‌ అయిన గత నెల రోజుల్లోనే ఈకామర్స్‌ ద్వారా రూ. 61,000 కోట్లకుపైగా(8.3 బిలియన్‌ డాలర్లు) బిజినెస్‌ జరగడం గమనార్హం! అయితే ఆన్‌లైన్‌ అమ్మకాలలో కొన్న అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని సీరియస్‌గా పరిగణిస్తున్న ప్రభుత్వం లోపాలకు చెక్‌ పెట్టేందుకు వీలుగా దేశీ ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కఠిన నిబంధనలను రూపొందించేందుకు వీలుగా స్టీరింగ్‌ కమిటీని సైతం ఎంపిక చేసినట్లు తెలియజేశారు. 

కమిటీ ఇలా
డిజిటల్‌ కామర్స్‌కు చెందిన ఓపెన్‌ నెట్‌వర్క్‌(ఓఎన్‌డీసీ) విధానాలకు వీలుగా కేంద్ర వాణిజ్య శాఖ 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తద్వారా ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధికి విధానాలు రూపొందించనుంది. ఇందుకు అనుగుణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల తరహా తుది స్టోర్‌ఫ్రంట్‌ తదితర మౌలిక సదుపాయాలను ఓఎన్‌డీసీ సమకూర్చనుంది. ఈ విషయాలపై వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో ప్రభుత్వ రంగానికి చెందిన పలు విభాగాల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసింది. డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. కమిటీలో ఈమార్కెట్‌, ఎంఎస్‌ఎంఈ, నితి ఆయోగ్‌, ఎన్‌పీసీఐ, ఎన్‌ఎస్‌డీఎల్‌ అధికారులతోపాటు.. జాతీయ ట్రేడర్ల సమాఖ్య, దేశీ రిటైలర్ల అసోసియేషన్‌ నుంచి ప్రతినిధులకు చోటు కల్పించింది. 

ఎందుకంటే?
పలు అవకతవకలకు చోటున్న ఈకామర్స్‌ రంగంలో సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వివిధ ప్లాట్‌ఫామ్స్‌ వృద్ధి చెందేందుకు వీలు కల్పించడం, కొనుగోలుదారులకు రక్షణ కల్పించడం తదితరాలకు తెరతీయాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా కొత్త విధివిధానాలతో ఈకామర్స్‌ బిజినెస్‌ను పటిష్ట పరచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి సొంత ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కొత్త విధానాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. అంతేకాకుండా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈకామర్స్‌ సంస్థలు అవలంబిస్తున్న విధానాలపై కొద్ది నెలలుగా దేశీ రిటైల్‌ రంగ సంస్థలు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రాండ్లతో భాగస్వామ్యం, భారీ డిస్కౌంట్లు, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్‌ నిర్వహణ తదితర అంశాలపైనా ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా