మార్పు వస్తోంది.. ఇంటి యజమానురాళ్లు పెరుగుతున్నారు

12 Mar, 2022 08:32 IST|Sakshi

2–3 ఏళ్లలో పెరిగిన కొనుగోళ్ల రేటు 

కోటక్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ శాంతి ఏకాంబరం  

న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగులు ఇంటి యజమానులుగా మారడం అన్నది గత రెండు మూడేళ్లలో పెరిగినట్టు కోటక్‌ మహీంద్రా బ్యాంకు ప్రెసిడెంట్‌ (కన్జ్యూమర్‌ బ్యాంకింగ్‌) శాంతి ఏకాంబరం తెలిపారు. అయినప్పటికీ మొత్తం మీద చూస్తే వీరి శాతం తక్కువగానే ఉన్నట్టు చెప్పారు. ఈ ధోరణి వారి ఆర్థిక స్వతంత్రత, నిర్ణయాలు తీసుకోవడాన్ని బలపరుస్తుందన్నారు. మహిళా సాధికారత కోటక్‌ బ్యాంకు ప్రాధాన్యతల్లో ఒకటని.. కోటక్‌ సిల్క్‌ పేరుతో మహిళల కోసం వినూత్నమైన సేవింగ్స్‌ ఖాతాను ఆఫర్‌ చేస్తున్నట్టు ఆమె చెప్పారు.

 ‘‘నేడు వృత్తి/వ్యాపారం/ఉద్యోగాల్లో ఉన్న మహిళలు ఇళ్లను కొంటున్నారు. ఇలా కొనుగోలు చేసే వారి సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. ప్రధాన దరఖాస్తుదారుగా వారు ఉంటూ, భర్త లేదా తండ్రిని సహ దరఖాస్తుదారుగా చేరుస్తున్నారు. గడిచిన 2–3 ఏళ్లలో ఇది గణనీయంగా పెరిగింది’’ అని శాంతి ఏకాంబరం  వివరించారు. ఒక్క మెట్రోల్లోనే ఇది కనిపించడం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నట్టు చెప్పారు. మహిళలు గృహ రుణాలు తీసుకోవడం ఆహ్వానించతగినదిగా పేర్కొన్నారు.    

చదవండి: డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌..: విజయానికి కావాలి ఓ డ్రెస్‌!

మరిన్ని వార్తలు