కేంద్ర రుణ భారం రూ.147 లక్షల కోట్లు!

28 Dec, 2022 14:25 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి రూ.147.19 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థికశాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్‌ త్రైమాసికం ముగిసేనాటికి ఈ పరిమాణం 145.72 లక్షల కోట్లు. అంటే మొదటి త్రైమాసికం నుంచి రెండవ త్రైమాసికానికి ప్రభుత్వ రుణ భారం ఒక శాతం పెరిగిందన్నమాట. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. 

మొత్తం రుణ భారంలో సెప్టెంబర్‌ ముగిసే నాటికి పబ్లిక్‌ డెట్‌ (క్లుప్తంగా ప్రభుత్వం తన లోటును తీర్చడానికి అంతర్గత, బాహ్య వనరుల నుండి తీసుకున్న రుణ మొత్తం) వాటా 89.1 శాతం. జూన్‌ 30 నాటికి ఈ విలువ 88.3 శాతం. దీని పరిధిలోకి వచ్చే డేటెడ్‌ సెక్యూరిటీల్లో (బాండ్లు) 29.6 శాతం మేర ఐదు సంవత్సరాలకన్నా తక్కువ కాలపరిమితిలో మెచ్యూర్‌ అవడానికి సంబంధించినది.  

డేటెడ్‌ సెక్యూరిటీల ద్వారా ప్రభుత్వం రెండవ త్రైమాసికంలో సమీకరించాల్సిన నోటిఫై మొత్తం రూ.4,22,000కోట్లుకాగా, సమీకరించింది రూ.4,06,000 కోట్లు. రీపేమెంట్లు రూ.92,371.15 కోట్లు. 

కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో కమర్షియల్‌ బ్యాంకుల వెయిటేజ్‌ సెప్టెంబర్‌ 38.3 శాతం ఉంటే, జూన్‌ త్రైమాసికానికి ఈ రేటు 38.04 శాతంగా ఉంది.  

గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ప్రభుత్వం చేసిన మొత్తం రీక్యాపిటలైజేషన్‌ (మూలధన కేటాయింపుల) పరిమాణం  మొత్తం రూ.2,90,600 కోట్లు.  ప్రైవేట్‌ రంగ బ్యాంకుగా వర్గీకరణ జరిగిన (2019 జనవరి 21న) ఐడీబీఐ బ్యాంక్‌కు రీక్యాపిటలైజేషన్‌ విలువ 
రూ. 4,557 కోట్లు.  

2021 సెప్టెబర్‌ 24 నాటికి భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వల పరిమాణం 638.64 బిలియన్‌ డాలర్లు అయితే, 2022 సెప్టెంబర్‌ 30 నాటికి ఈ విలువ 532.66 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.  

2022 జూలై 1 నుంచి 2022 సప్టెంబర్‌ 30 మధ్య డాలర్‌ మారకంలో రూపాయి విలువ 3.11 శాతం క్షీణించింది. జూలై 1న రూపాయి విలువ 79.09 ఉంటే, సెప్టెంబర్‌ 30 నాటికి 81.55కు పడింది.

>
మరిన్ని వార్తలు