Covid Crisis: తప్పనిసరి పరిస్థితుల్లో.. బంగారం అమ్ముకుంటున్నారు

12 Jul, 2021 13:59 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: కరోనా వైరస్‌ ముందుగా చేతులకు అంటుకుని.. ఆ తర్వాత నోరు, ముక్కు, కళ్ల ద్వారా గొంతులోకి చేరుతుంది. అక్కడ పెరిగి ఊపిరితిత్తుల్లో తిష్ట వేసుకుని ప్రాణాంతకమవుతుంది. కరోనా కష్టాలు కూడా ఇలాగే ఉన్నాయి. ముందుగా ఆప్పులు, ఆ తర్వాత తాకట్టులు, చివరకు ఉన్న ఆస్తులు అమ్మేయడం. తాజా గణాంకాలు ఇదే చెబుతున్నాయి. కరోనా దెబ్బకు భారీ ఎత్తున బంగారం తాకట్టు పెట్టడమో లేదా అమ్ముకోవడమో చేస్తున్నారు భారతీయులు.

పొదుపు సొమ్ముతోనే
కరోనా మహమ్మారి కట్టడికి 2020లో తొలిసారి లాక్‌డౌన్‌ విధించారు. దాదాపు మూడు నెలల పాటు కఠిన ఆంక్షలు కొనసాగాయి. కరోనా భయంతో దాదాపు దేశమంతటా ఈ కఠిన నిబంధనలకు మద్దతుగానే నిలిచారు. ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదాయం లేక పోయినా దాచుకున్న సొమ్ముతో, పొదుపు చేసిన మనీతో ఇళ్లు గడిపేశారు.

కుదువ బెట్టారు
కానీ ఆరు నెలలు తిరగకుండానే కరోనా సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడింది. ప్రతీ రోజు వేల సంఖ్యలో మరణాలు, లక్షల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. మళ్లీ కఠిన ఆంక్షలు తెరపైకి వచ్చాయి. జనజీవనం స్థంభించిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యులకు, వేతన జీవులపైనా తీవ్ర ప్రభావం చూపింది కరోనా. అయితే ఈసారి ఇళ్లు గడిచేందుకు ఎంతో కష్టపడి కొనుకున్న బంగారం, ముచ్చపటి చేసుకున్న ఆభరణాలే దిక్కయ్యాయి. 

తాకట్టుతో సరి
మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌ సంస్థ గత మూడు నెలలో సుమారు రూ. 404 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేసింది. అంతకుముందు తొమ్మిది నెలల్లో కేవలం రూ. 8 కోట్ల రూపాయల విలువైన బంగారాన్నే ఆ సంస్థ వేలం వేసింది. అంటే కరోనా కష్టాలతో మణపురం దగ్గర తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునే పరిస్థితి సామాన్యులకు లేకపోయింది. అందుకే ఆ సంస్థకే బంగారాన్ని వదిలేశారు. ఇలా నష్టపోయని వారిలో రైతులు, చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, కార్మికులే ఎక్కువగా ఉన్నారు. 

భయపెడుతున్న థర్డ్‌ వేవ్‌
ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన వారిని మరింత భయపెడుతోంది థర్డ్‌ వేవ్‌ ముప్పు. మరోసారి దేశంపై కరోనా విజృంభిస్తే బంగారం మీద రుణాలు తీసుకోవడం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని లండన్ కు చెందిన మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ కన్సల్టెంట్ చిరాగ్ సేఠ్ వెల్లడించారు. ఆర్థిక అవసరాల కోసం పాత బంగారం అమ్మకాలు భారీగా పెరగవచ్చన్నారు. ఈ మొత్తం  215 టన్నులు దాటొచ్చని అంచనా వేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఇదే అత్యధికమని ఆయన చెబుతున్నారు. 

25 శాతం తగ్గాయి
కరోనా ఎఫెక్ట్‌తో పాత బంగారం అమ్మకాలు సౌతిండియాలో ఈ సారి 25 శాతం ఎక్కువగా ఉన్నాయని కొచ్చికి చెందిన బంగారం శుద్ధి చేసే సంస్థ  సీజీఆర్ మెటల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జేమ్స్ జోష్ అభిప్రాయపడ్డారు. 

తగ్గిన కొనుగోళ్లు

కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రెండేళ్లుగా భారతీయులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం గత ఏడాది అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 

అమ్మకాలు పెరగొచ్చు
మరోవైపు ఈ ఏడాది అమ్మకాలు 40 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు ఆశాభావం వ్యక​‍్తం చేస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ధరలు తగ్గడం, వివాహాల సీజన్ ఉండడంతో 50 టన్నులకు పైగా బంగారం క్రయవిక్రయాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు