ధరల స్పీడ్‌కు వడ్డీ రేటు పెంపు బ్రేక్‌!

20 Oct, 2022 00:19 IST|Sakshi

ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యురాలు అషిమా గోయల్‌ భరోసా

2023లో  ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు పడుతుందని విశ్లేషణ  

న్యూఢిల్లీ: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) పెంపు చర్యలు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్డికి దోహదపడుతుందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్‌ స్పష్టం చేశారు. 2023లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివస్తుందన్న బరోసా ఇచ్చారు.

వ్యవస్థలో ప్రస్తుత వడ్డీరేట్లు  వృద్ధి రికవరీకి ఎటువంటి విఘాతం ఏర్పడని స్థాయిలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుముఖం పడతాయని, సరఫరాల చైన్‌ మున్ముందు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆమె ఒక టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలో తెలిపారు. సరఫరాల వైపు సమస్యలను తగ్గించడానికి భారత్‌ ప్రభుత్వం నుంచి సైతం తగిన చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

ఇవన్నీ వచ్చే ఐదారు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ   గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్‌ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని మరో ఎంపీసీ సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.   

కరెన్సీ విషయంలో మనం బెస్ట్‌
డాలర్‌ మారకంలో భారత్‌ రూపాయి ఎప్పటికప్పుడు చరిత్రాత్మక కనిష్టాలను తాకుతున్న అంశానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో ఒకరైన గోయల్‌ సమాధానం చెబుతూ,  ‘క్షీణించిన రూపాయి దిగుమతుల బిల్లును మరింత పెంచుతుంది. విదేశాలలో రుణాలు తీసుకున్న వారిని సమస్యల్లోకి నెడుతుంది.  అయితే కొంతమంది ఎగుమతిదారులకు రాబడిని పెంచుతుంది’ అని అన్నారు.  

ఫెడ్‌ రేట్లు పెరగడం వల్ల అమెరికా తిరిగి వెళుతున్న డాలర్ల వల్ల ఈ రిజర్వ్‌ కరెన్సీ విలువ పెరుగతోందని అన్నారు. అన్ని కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలపడుతోందని వివరించారు. ఇతర అభివృద్ధి చెందిన, వర్థమాన మార్కెట్లతో పోల్చితే రూపాయి విలువ పతనం తక్కువగా ఉందని అన్నారు. ఇటీవల ఈక్విటీ ఇన్‌ఫ్లోస్‌ కూడా తిరిగి పెరుగుతున్నట్లు తెలిపారు. భారత్‌ ఈక్విటీల ధరల పతనం తక్కువగా పలు దేశాలతో పోల్చితే తక్కువగా ఉందని స్పష్టం చేశారు. భారత్‌ మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తుందని పేర్కొన్నారు. 

వాల్యుయేషన్‌ ప్రభావాల వల్లే భారత్‌ విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్‌) ఎక్కువగా పడిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ఫారెక్స్‌ ఏడాది కాలంలో దాదాపు 100 డాలర్ల తగ్గి 544 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇందులో 77 శాతం వ్యాల్యుయేషన్ల ప్రభావం వల్లే తగ్గాయని ఆర్‌బీఐ సెప్టెంబర్‌ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా వివరించిన సంగతి తెలిసిందే. తక్కువ దిగుమతులు– అధిక ఎగుమతులు కరెంట్‌ ఖాతా (భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసం) లోటును తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్న ఆమె, ఎగుమతుల పెంపు ఆవశ్యకతను ఉద్ఘాటించారు.  

అంతర్జాతీయ మందగమనం
ప్రతికూలమే, కానీ...
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయంపై అడిగిన ప్రశ్నకు గోయల్‌ సమాధానం చెబుతూ,  ప్రపంచ మందగమనం భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ‘కానీ భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్‌ ఉంది. దాని పరిమాణం, వైవిధ్యం, వైశాల్యం, ఆర్థిక రంగం బలం మంచి సానుకూల వృద్ధినే అందిస్తుంది’’ అని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో కార్పొరేట్‌లు రుణాన్ని తగ్గించుకున్నారని, ఆర్థిక రంగం బాగా మూలధనం పొందిందని గోయల్‌ తెలిపారు.  ఇవన్నీ భారతదేశానికి అంతర్జాతీయంగా ఎదురయ్యే ‘మందగమన’ సవాళ్లను తగ్గిస్తాయని వివరించారు.

డిసెంబర్‌లో మరో అరశాతం పెంపు అవకాశం
అషిమా గోయల్‌ ప్రకటన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్‌ 5 నుంచి 7వ తేదీ వరకూ జరిగే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటును కనీసం అరశాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. 2022 సెప్టెంబర్‌ వరకూ  గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్‌బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్‌ బ్యాంక్‌కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్‌బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు)  ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్‌ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్‌ తర్వాత) చేరింది.  మరింత పెరగవచ్చనీ ఆర్‌బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది.  

>
మరిన్ని వార్తలు