గూగుల్‌ జాబ్‌నే వద్దనుకున్న ఈ ఇన్‌ఫ్లుయన్సర్‌ గురించి తెలుసా?

2 Nov, 2023 22:23 IST|Sakshi

నిహారిక ఎన్‌ఎం (Niharika NM).. అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌. ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో చాలా పాపులర్‌ అయ్యారు. చాలా మంది సెలబ్రిటీలతో కలిసి రీల్స్‌ చేసిన ఆమె ఆమధ్య కాఫీ విత్ కరణ్‌ కార్యక్రమంలో కనిపించి మరింత పాపులర్‌ అయింది.

సోషల్‌ మీడియాలో ఇంత పాపులర్‌ అయిన నిహారిక ప్రఖ్యాత అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ గూగుల్‌ (Google)లో జాబ్‌ వచ్చినా వద్దనుకుందని మీకు తెలుసా? తాజాగా జరిగిన మనీకంట్రోల్ క్రియేటర్ ఎకానమీ సమ్మిట్‌లో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నేనే బ్రాండ్‌ కావాలనుకున్నా
బెంగళూరులో జన్మించిన నిహారిక కాలిఫోర్నియాలోని చాప్‌మన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. గూగుల్‌ జాబ్‌ను వద్దనుకోవడం ఆవేశపూరిత నిర్ణయం కాదని, ఆ ఆఫర్‌ను తిరస్కరించే ముందు తమ కుటుంబమంతా కూర్చుని లాభనష్టాలను బేరీజు వేసుకున్నట్లు వివరించారు. కంటెంట్ క్రియేటర్‌గా ఇతర బ్రాండ్‌లకు మార్కెటింగ్ చేయడం కన్నా తానే బ్రాండ్‌ కావాలని కోరుకున్నానని అందుకే గూగుల్‌ జాబ్‌ను వద్దనుకున్నట్లు చెప్పారు. 

తాను ఆ ఉద్యోగంలో చేరి ఉంటే తన అమ్మ గర్వపడేదని చెప్పుకొచ్చిన నిహారిక.. అప్పటి వరకూ తన డ్రీమ్‌ కూడా అదేనని పేర్కొన్నారు. “ఆ ఉద్యోగం సంపాదించడం నా కల. అందుకోసం చాలా కష్టపడ్డాను. తీరా అది పొందినప్పుడు 'లేదు, ఇప్పుడు నాకు అది వద్దు' అని తిరస్కరించడం అంత సులభం కాదు. ఇది కుటుంబ నిర్ణయం” అని ఆమె వివరించింది.

 

అందరికీ ఒకే సూత్రం సరిపోదు
ఇక గూగుల్‌లో ఎంపిక గురించి మాట్లాడుతూ ‘అది చాలా విభిన్న ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.  గూగుల్‌ ఇంటర్వ్యూను క్రాక్‌ చేయడానికి అందరికీ ఒకే సూత్రం సరిపోదు’ అన్నారు. 

తన లాగా కంటెంట్ క్రియేషన్‌లో అడుగుపెడుతున్న యువత కోసం కొన్న ఆచరణాత్మక సలహాలు కూడా ఇచ్చింది నిహారిక. ముందు చదువు పూర్తి చేయాలని, ఒక వేళ జాబ్‌ చేస్తున్నట్లయితే అది పూర్తిగా మానేయకుండా కొనసాగిస్తూ  కంటెంట్ క్రియేషన్‌ను సైడ్ హస్టిల్‌గా కొనసాగించాలని సలహా ఇచ్చింది.

మరిన్ని వార్తలు