బీమా... పూర్తిగా డిజిటల్‌!

24 Aug, 2020 04:31 IST|Sakshi

 ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌ లైన్‌ టర్మ్‌ప్లాన్లు పాలసీదారుల సమ్మతి వ్యక్తీకరణ కూడా ఆన్‌లైన్‌ లోనే నిబంధనల్లో వెసులుబాటుప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఆఖరు వరకు సత్ఫలితాలను ఇస్తే మరిన్ని బీమా ఉత్పత్తులకు విస్తరణ

వ్యక్తుల మధ్య భౌతిక దూరం.. అత్యవసర పనులకే కాలు బటయటపెట్టడం.. వీలుంటే ఇంటి నుంచే కార్యాలయ పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌).. ఇవన్నీ కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన మార్పులు. బీమా పరిశ్రమ అభివద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఈ పరిస్థితులను అర్థం చేసుకుంది. అన్ని రకాల టర్మ్‌ పాలసీలను, ఇందుకు సంబంధించి ఇతర సేవలను డిజిటల్‌ గా అందించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆఫ్‌ లైన్‌ విభాగంలోని టర్మ్‌ ప్లాన్లు, వాటి డాక్యుమెంట్లను కూడా బీమా సంస్థలు ఇప్పుడిక డిజిటల్‌ గానే అందించనున్నాయి. ఫలితంగా పాలసీదారులు సౌకర్యంగా, తామున్న చోటు నుంచే పాలసీలను పొందే వీలు కలిగింది. కోవిడ్‌–19 ్టకాలంలో  ఆఫ్‌ లైన్‌ బీమాకు  సంబంధించి  ఇదొక వెసులుబాటు.

కరోనా వైరస్‌ చాలా రంగాల్లో డిజిటైజేషన్‌ కు దారితీసిందనే చెప్పుకోవాలి. బీమా పరిశ్రమ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. బీమా సంస్థలు ఆన్‌ లైన్‌ మాధ్యమాల ద్వారా పాలసీలను విక్రయించేందుకు, అదే విధంగా పాలసీదారులు ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేసుకునేందుకు, బీమా క్లెయిమ్‌ లు చేసుకునేందుకు వీలుగా ఐఆర్డీఏఐ నిబంధనల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ఆన్‌ లైన్‌ లో బీమా పాలసీలను దాదాపు అన్ని సంస్థలు ఇప్పటికే ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, ఆఫ్‌ లైన్‌ లో అందించే టర్మ్‌ పాలసీలను కూడా డిజిటల్‌ రూపంలో అందించడం తాజాగా వచ్చిన మార్పుల్లో భాగమని చెప్పుకోవాలి. బీమా పరిశ్రమ పూర్తిగా డిజిటల్‌ రూపం సంతరించుకునే దిశగా ఇది తొలి మెట్టుగానే భావించాలి. బీమా పరిశ్రమ మరింత విస్తరణకు కూడా ఈ నిర్ణయం దోహదపడే వీలుంది.

ప్రపోజల్స్‌కు డిజిటల్‌ ఆమోదం
ఆన్‌ లైన్‌ ద్వారా టర్మ్‌ ప్లాన్లను కొనుగోలు చేయడం నేటి యువతరానికి కొత్తేమీ కాదు. కానీ, ఆఫ్‌ లైన్‌ లో అంటే బీమా ఏజెంట్లు లేదా బీమా కార్యాలయాల నుంచి పాలసీలను తీసుకోవాలంటే ప్రస్తుతం వెనుకాడాల్సిన పరిస్థితులున్నాయి. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా బీమా పాలసీల పంపిణీ, ప్రచారం అన్నది కరోనా వైరస్‌ విస్తరణ సమయంలో కష్టసాధ్యమని ఐఆర్డీఏఐ గుర్తించింది. భౌతికంగా పాలసీదారులు ప్రపోజల్‌ పత్రాలను పూర్తి చేయడం, సంతకాలు చేసిన తర్వాత వాటిని సమర్పించడం వంటి పనులపై కరోనా ప్రభావం ఉన్నట్టు గుర్తించిన ఐఆర్డీఏఐ నిబంధనల పరంగా వెలుసుబాటు కల్పించింది.  ‘‘టర్మ్‌ ప్లాన్లు అర్థం చేసుకునేందుకు ఎంతో సులభంగా ఉంటాయి. ఇప్పుడు టర్మ్‌ ప్లాన్లను తీసుకునేందుకు భౌతికంగా సంతకాలు అవసరం లేకుండా చేయడం అన్నది మంచి నిర్ణయమే అవుతుంది’’ అని ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డిప్యూటీ సీఈవో రుషబ్‌ గాంధీ పేర్కొన్నారు.  

‘‘కరోనా నేపథ్యంలో కస్టమర్లు ఎవరిని కలవాలన్నా వెనుకాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రపోజల్‌ పత్రాలను ఫోన్‌ ద్వారా లేదా వీడియోకాల్‌ ద్వారా తీసుకుంటున్నాం. అయితే, సంతకం తీసుకోవడం సవాలుగానే ఉంది. దీంతో డిజిటల్‌ రూపంలో ఓటీపీ ద్వారా ఆమోదం తీసుకోవడం దీనికి పరిష్కారం. ప్రపోజల్‌ పత్రాలకు సంబంధించి కస్టమర్ల సంతకాలు లేకుండానే వారి ఆమోదం తీసుకునేందుకు బీమా సంస్థలను ఐఆర్డీఏఐ అనుమతించింది’’ అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ న్యాయ, నిబంధనల విభాగం హెడ్‌ అనిల్‌ పీఎం తెలిపారు. ఈ విధానంలో కస్టమర్ల మెయిల్‌ బాక్స్‌ కు ఈ మెయిల్‌ రూపంలో లేదా మొబైల్‌ నంబర్‌ కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో లింక్‌ ను బీమా సంస్థలు పంపిస్తాయి. ఈ  లింక్‌ ను క్లిక్‌ చేసి వచ్చే పేజీలో ఓటీపీ ఇవ్వడం ద్వారా ప్రపోజల్‌ పత్రానికి ఆమోదం తెలియజేసినట్టు అవుతుంది.

పూర్తిగా నింపిన ప్రపోజల్‌ పత్రానికి పాలసీదారులు ఆమోదం తెలిపినట్టుగా చట్టపరమైన ఆధారాలను బీమా సంస్థలు కలిగి ఉండాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా అవసరమైన డిజిటల్‌ సదుపాయాలు కల్పించుకోవాలని ఆదేశించినట్టు అనిల్‌ తెలిపారు. అదే విధంగా డిజిటల్‌ విధానంలో కస్టమర్లు ప్రపోజల్‌ పత్రానికి సంబంధించి ఆమోదం తెలియజేసే వరకు ప్రీమియం ముందుగా చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన పేర్కొన్నారు. నూతన విధానాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు ప్రయోగాత్మకంగా ఐఆర్డీఏఐ అనుమతించినట్టు చెప్పారు. ‘‘టర్మ్‌ ప్లాన్ల వ్యాపారం ఎక్కువగా ఆన్‌ లైన్‌ విధానంలో కొనసాగుతోంది. కాకపోతే ఐఆర్డీఏఐ తాజా ఆదేశాల వల్ల ఆఫ్‌ లైన్‌ విధానంలోనూ టర్మ్‌ ప్లాన్లను విక్రయించే బీమా సంస్థలకు వెసులుబాటు లభించనుంది. నిజంగా ఇది సులభతరమైన ప్రక్రియే అవుతుంది. ఇది మంచి ఫలితాలను ఇస్తే ఇతర బీమా ఉత్పత్తులకూ ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది’’ అని అనిల్‌ వివరించారు.

ఈ–పాలసీలు
ఈ సమయంలో బీమా పాలసీ పత్రాలను ప్రచురించడం, వాటిని కస్టమర్లకు అందించడం చాలా కష్టమైన పని అంటూ బీమా కంపెనీలు ఐఆర్డీఏఐకు మొరపెట్టుకున్నాయి. తద్వారా అన్ని రకాల జీవిత బీమా పాలసీలను ఆన్‌ లైన్‌ లో డిజిటల్‌ రూపంలో అందించేందుకు అనుమతి పొందాయి. దీంతో కొత్తగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే వారికి పాలసీ డాక్యుమెంట్లను వారి మెయిల్‌ ఐడీకి బీమా సంస్థలు పంపిస్తున్నాయి. 2016లో ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన నిబంధనల మేరకు.. బీమా ప్లాన్‌ పత్రాలను ఎలక్ట్రానిక్‌ రూపంలో పంపించడంతోపాటు.. హార్డ్‌ కాపీని కూడా పాలసీదారులకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్‌ అకౌంట్‌ సదుపాయాన్ని వినియోగించుకున్న కస్టమర్లకు మాత్రం బీమా ప్లాన్‌ డిజిటల్‌ కాపీని పంపిస్తే సరిపోయేది. ఇప్పుడిక ఈ నియంత్రణల్లేవు. పాలసీబాండ్‌ ను పీడీఎఫ్‌ రూపంలో కస్టమర్‌ మెయిల్‌ బాక్స్‌ కు పంపించినా సరిపోతుందని, ఫిజికల్‌ పాలసీ డాక్యుమెంట్‌ ను పంపించడం తప్పనిసరి కాదని అనిల్‌ వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రీలుక్‌ పీరియడ్‌ పరంగానూ జాప్యం అవుతోంది. కస్టమర్లు బీమా పాలసీని అందుకున్న నాటి నుంచి 15 రోజుల్లోపు తమకు నచ్చకపోతే వెనక్కి తిప్పి పంపొచ్చు. అప్పుడు కట్టిన ప్రీమియంలో అధిక భాగం వెనక్కి వచ్చేస్తుంది. అయితే, ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ రూపంలో పాలసీని అందుకుంటున్న కస్టమర్లకు బీమా సంస్థలు 30 రోజుల ఫ్రీ లుక్‌ పీరియడ్‌ ను అమలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు తమ పాలసీ డాక్యుమెంట్‌ ను అర్థం చేసుకునేందుకు మరింత సమయం లభించినట్టు అయింది. పాలసీ వద్దనుకుంటే 30 రోజుల్లోపు వారు ఎలక్ట్రానిక్‌ రూపంలోనే తిప్పి పంపించేయవచ్చని, కేవలం ఈ మెయిల్‌ ద్వారా విషయాన్ని తెలియజేసినా సరిపోతుందని ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డిప్యూటీ సీఈవో రుషబ్‌ గాంధీ  తెలిపారు. మొత్తంమీద  బీమా రంగం విస్తరణకు కూడా తాజా నిర్ణయాలు దోహదపడతాయని విశ్లేషణ.

కస్టమర్ల అభీష్టమే..
ప్రస్తుత పరిస్థితుల కారణంగా డిజిటల్‌ పాలసీలను పంపిస్తే చాలన్న వెసులుబాటును ఐఆర్డీఏఐ కల్పించింది. కానీ, తమకు ఫిజికల్‌ గా పాలసీ బాండ్‌ కావాలంటూ పాలసీదారులు డిమాండ్‌ చేస్తే బీమా సంస్థలు తప్పకుండా పంపించాల్సి ఉంటుంది. అందుకు ఎటువంటి చార్జీలను కూడా అదనంగా వసూలు చేయకూడదు. డిజిటల్‌ రూపంలో పాలసీల జారీ ప్రక్రియ వల్ల బీమా కంపెనీలకు నిర్వహణ, ప్రాసెస్‌ ఖర్చులు తగ్గుతాయి. ఇలా ఆదా అయిన మొత్తాన్ని కస్టమర్ల సేవల మెరుగుదలపై కంపెనీలు ఖర్చు చేయగలవని గాంధీ పేర్కొన్నారు.

దీనివల్ల సందిగ్ధత తొలగిపోవడంతోపాటు, బీమా కంపెనీలు, కస్టమర్లు నేరుగా అనుసంధానమయ్యేందుకు, పారదర్శకత పెంపునకు దారితీస్తుంది. కొనుగోలు ప్రక్రియ సులభతరం అవడం వల్ల మరింత మంది బీమా పాలసీల కొనుగోలుకు ప్రోత్సాహకరంగా ఉంటుందని బీమా కంపెనీలు అంటున్నాయి. అన్నింటి మాదిరే బీమా పాలసీ బాండ్‌ ను కూడా ఫోన్‌ ద్వారా పొందడం మంచి పరిణామంగా అనిల్‌ పేర్కొన్నారు. భౌతికంగా పాలసీ పత్రాలను పంపే విషయంలో చిరునామాల్లో తప్పులు దొర్లడం కారణంగా కొన్ని కంపెనీలకు తిరిగి వెళుతుంటాయి. అదే డిజిటల్‌ పాలసీ విషయంలో ఇటువంటి ఇబ్బందులు ఉండకపోవడం కూడా కస్టమర్లు, బీమా కంపెనీలకు సౌకర్యంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు