స్టార్టప్‌లకు 5 వేల్యుయేషన్‌ విధానాలు 

27 Sep, 2023 00:42 IST|Sakshi

ఏంజెల్‌ ట్యాక్స్‌ నిబంధనల నోటిఫికేషన్‌ జారీ

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్‌ అంకుర సంస్థలు జారీ చేసే షేర్ల విలువను మదింపు చేసే విధానాలకు సంబంధించి కొత్త ఏంజెల్‌ ట్యాక్స్‌ నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 11యూఏ నిబంధనలో ఈ మేరకు సవరణలు చేసింది. దీని ప్రకారం అన్‌లిస్టెడ్‌ స్టార్టప్‌లు జారీ చేసే ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల (సీసీపీఎస్‌) వేల్యుయేషన్‌ను సముచిత మార్కెట్‌ విలువ (ఎఫ్‌ఎంవీ)కి పది శాతం అటూ ఇటూగా లెక్క కట్టవచ్చు. ప్రవాస ఇన్వెస్టర్లు అయిదు రకాల వేల్యుయేషన్‌ విధానాలను ఉపయోగించవచ్చు.

ఆప్షన్‌ ప్రైసింగ్‌ విధానం, మైల్‌స్టోన్‌ అనాలిసిస్‌ విధానం మొదలైనవి వీటిలో ఉంటాయి. దేశీ ఇన్వెస్టర్లకు ఈ అయిదు విధానాలు వర్తించవు. రూల్‌ 11 యూఏ ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతమున్న డీసీఎఫ్‌ (డిస్కౌంటెడ్‌ క్యాష్‌ ఫ్లో), ఎన్‌ఏవీ (అసెట్‌ నికర విలువ) విధానాలు వర్తిస్తాయి. ఎఫ్‌ఎంవీకి మించిన ధరకు షేర్లను విక్రయించడం ద్వారా స్టార్టప్‌లు సమీకరించిన నిధులపై వేసే పన్నును ఏంజెల్‌ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇది తొలుత దేశీ ఇన్వెస్టర్లకే పరిమితమైనప్పటికీ 2023–24 బడ్జెట్‌లో విదేశీ పెట్టుబడులను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయిదు రకాల వేల్యుయేషన్స్‌ విధానాలను అందుబాటులోకి తేవడం వల్ల ఇన్వెస్టర్లకు పన్నులపరంగా కొంత వెసులుబాటు పొందే వీలు లభించగలదని డెలాయిట్‌ ఇండియా, నాంగియా అండ్‌ కో తదితర సంస్థలు తెలిపాయి.
 

మరిన్ని వార్తలు