వాహన అమ్మకాలు రికార్డ్‌!

3 Apr, 2023 04:56 IST|Sakshi

గతేడాది అత్యధిక విక్రయాలు

మారుతీ మొత్తం సేల్స్‌ 19,66,144

మార్చిలోనూ మెరుగ్గానే...

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశీ వాహన రంగ దుమ్మురేపింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్‌ గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక అమ్మకాలను సాధించాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 2022–23లో ఎగుమతులు, దేశీయంగా కలిపి మొత్తం 19,66,164 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది (2021–22)లో 16,52,653 యూనిట్లతో పోలిస్తే సేల్స్‌ 19 శాతం పెరిగాయి.

హ్యుందాయ్‌ మొత్తం అమ్మకాలు సైతం 18 శాతం ఎగబాకి 7,20,565 యూనిట్లుగా నమోదయ్యాయి. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఒక ఏడాదిలో సాధించిన అత్యధిక విక్రయాలు ఇవేనని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా పేర్కొంది. టాటా మోటార్స్‌ దేశీయంగా గతేడాది 5,38,640 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 45 శాతం వృద్ధి చెందాయి.

పరిశ్రమవ్యాప్తంగా...
చిప్‌ కొరత కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం పడుతున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో తాము అత్యధిక విక్రయాలను సాధించామని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్, సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహన పరిశ్రమ అమ్మకాలు 27 శాతం వృద్ధి చెంది 38.89 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపారు. 2021–22లో సేల్స్‌ 30.62 లక్షలు. రిటైల్‌గా, మొత్తం విక్రయాల పరంగా చూసినా గతేడాది పరిశ్రమ అత్యధిక అమ్మకాలను నమోదు చేసిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40–41 లక్షల అమ్మకాలను అంచనా వేస్తున్నామన్నారు.

మార్చిలో చూస్తే...
మారుతీ సుజుకీ మార్చి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా సేల్స్‌ 3 శాతం తగ్గి 1,39,952 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్‌ విక్రయాలు మాత్రం 13 శాతం ఎగబాకాయి. టాటా మోటార్స్‌ దేశీ అమ్మకాలు 3 శాతం పెరిగాయి. ద్విచక్రవాహన సంస్థలు హీరోమోటో, హోండా, టీవీఎస్, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మెరుగైన విక్రయాలను నమోదు చేశాయి.

మరిన్ని వార్తలు