పెరిగిన పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు | Sakshi
Sakshi News home page

పెరిగిన పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు

Published Mon, Apr 3 2023 4:49 AM

Increased petrol and diesel sales march 2023 - Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయ కార్యకలాపాలు పుంజుకోవడంతో మార్చిలో భారత్‌లో ఇంధన డిమాండ్‌ పెరిగింది.  నెల మొదటి అర్ధభాగంలో కనిపించిన మందగమనాన్ని అధిగమిస్తూ, నెల మొత్తంగా ఇంధన డిమాండ్‌ పెరిగినట్లు పరిశ్రమల ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగం నుండి బలమైన డిమాండ్, చలికాలం తర్వాత రవాణా పుంజుకోవడం వంటి కారణాలతో ఫిబ్రవరిలో ఇంధన అమ్మకాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. కానీ మార్చి మొదటి అర్ధభాగంలో కాలానుగుణంగా మందగమనం మొదలైంది. అయితే నెల రెండవ సగ భాగంలో తిరిగి ఎకానమీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ వ్యవసాయ రంగ క్రియాశీలత మెరుగుపడ్డం మెరుగైన ఫలితానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

► గత ఏడాది మార్చితో పోలిస్తే  2023 మార్చిలో పెట్రోలు విక్రయాలు 5.1 శాతం పెరిగి 2.65 మిలియన్‌ టన్నులకు చేరుకున్నాయి. అమ్మకాలు నెలవారీగా 3.4 శాతం పెరిగాయి.  
► డీజిల్‌ విషయంలో మార్చిలో వార్షిక డిమాండ్‌ 2.1 శాతం పెరిగి 6.81 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యింది. 2022 మార్చిలో ఈ పరిమాణం 6.67 మిలియన్‌ టన్నులు. నెలవారీగా చూస్తే, డిమాండ్‌ 4.5 శాతం పెరిగింది.  
► ఒక్క జెట్‌ ఫ్యూయెల్‌ డిమాండ్‌ పరిశీలిస్తే, డిమాండ్‌ 25.7 శాతం పెరిగి 614000 టన్నులుగా నమోదయ్యింది.  
► కాగా, కుకింగ్‌ గ్యాస్‌ ఎల్‌పీజీ అమ్మకాలు మార్చిలో వార్షికంగా  3 శాతం పడిపోయి 2.37 మిలియన్‌ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే, డిమాండ్‌ 6.54 శాతం పడిపోయింది. ఫిబ్రవరి డిమాండ్‌ 2.54 మిలియన్‌ టన్నులు.

Advertisement
Advertisement