JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..

26 Jul, 2023 14:15 IST|Sakshi

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. 

భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్‌ జియో బ్రాండ్‌ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్‌ వీ2 (JioBharat V2) ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో  ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్‌ ఇదే. 

మరిన్ని ఫోన్ల ఉత్పత్తి..

ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్‌ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్‌వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్‌  జియో ‘జియో భారత్‌’ ఫోన్‌ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్‌ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్‌పీ పారిబాస్‌ ఓ నివేదికలో పేర్కొంది.

 

జియో భారత్ వీ2 ఫోన్‌లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్‌, 1000mAh రిమూవబుల్‌ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్  టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే   ప్రముఖ ఉచిత మ్యూజిక్‌ యాప్ జియో సావన్‌, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్‌ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! 

ప్రస్తుతానికి కార్బన్‌ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్‌లను రిలయన్స్‌ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్‌ జియోతో జత కలిసే అవకాశం ఉంది.  అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్‌ కోసం రిలయన్స్‌ సరసమైన డేటా ప్లాన్‌లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు