వీడు మాములోడు కాదు.. ఆత్మనే అమ్మకానికి పెట్టాడు!

2 Apr, 2022 15:12 IST|Sakshi

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే మార్కెట్‌కి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఐస్‌క్రీం మొదలు కారు వరకు అన్ని ఈ కామర్స్‌ వేదికగా ఇంటికే వచ్చేస్తున్నాయి. ఇప్పుడే మార్కెట్‌లో మరింత అడ్వాన్స్‌మెంట్‌ చోటు చేసుకుంది. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ వినియోగంతో ఏకంగా ఆత్మలనే అమ్మకానికి పెడుతున్నారు. 

నెదర్లాండ్స్‌కి చెందిన హాగ్‌ ఆర్ట్‌ అకాడమీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థి స్టిన్‌ వాన్‌ షైక్‌ నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ (ఎన్‌ఎఫ్‌టీ)గా తన సోల్‌ (ఆత్మ)ని అమ్మకానికి పెట్టాడు. ఓపెన్‌ సీ మార్కెట్‌ ప్లేస్‌లో సోల్‌ ఆఫ్‌ స్టైనస్‌ పేరుతో అమ్మకానికి సంబంధించిన వివరాలు అతడు పోస్ట్‌ చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆత్మనే అమ్మకానికి పెట్టడంతో ఒక్కసారిగా నెట్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయాడు. ఇతని గురించి మరిన్ని వివరాలు ఆరా తీయగా తన ఆత్మను అమ్మేందుకు వెబ్‌సైట్‌ కూడా ఓపెన్‌ చేసినట్టు తెలిసింది.

ఎన్‌ఎఫ్‌టీ రూపంలో ఉన్న తన ఆత్మను బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో క్రిప్టో చెల్లింపుల ద్వారా కొనుగోలు చేయవచ్చని సూచించాడు. ఒక్కసారి ఒప్పందం పూర్తయిన తర్వాత ఎలాంటి మార్పులు ఉండవని ముందే స్పష్టం చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతని ఆత్మను కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపించగా అత్యధికంగా 0.1 ఇథేరియం ( 347 డాలర్లు) వరకు ధర పలుకుతోంది. బిడ్‌ ముగిసే లోపు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ఇంతకీ ఈ ఆత్మను కొనుగోలు చేసిన వ్యక్తి ఏం చేయవచ్చనే సందేహాన్ని కూడా అతడే నివృత్తి చేశాడు. తన ఎన్‌ఎఫ్‌టీ రూపంలో తన ఆత్మను సొంతం చేసుకున్నవారు... వారి వారి మత విశ్వాసాలకు తగ్గట్టుఉగా తన ఆత్మను పార్టులు పార్టులుగా లేదా ఏకమొత్తంగా మొక్కుగా చెల్లించుకోవచ్చని సూచిస్తున్నాడు,. అవసరమైతే ఆత్మబలిదానం(త్యాగం) చేసుకోవచ్చంటూ బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నాడు. 

గత రెండేళ్లుగా ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్‌ పుంజుకుంటోంది. అమితాబ్‌ బచ్చన్‌, మహేంద్ర సింగ్‌ధోని వంటి వారు తమ ప్రతిభకు సంబంధించిన అంశాలను ఎన్‌ఎఫ్‌టీలుగా అమ్మకానికి పెట్టారు. రామ్‌ గోపాల్‌ వర్మ్‌ సైతం డేంజరస్‌ సినిమాను బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై అందుబాటులో ఉంచారు. అయితే వీటన్నింటీని బీట్‌ చేస్తూ నెదర్లాండ్‌ స్టూడెంట్‌ ఏకంగా ఆత్మనే అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించాడు. 

చదవండి: భయపెట్టిన 3 అంకెలు..! ఎట్టకేలకు సెంచరీ కొట్టిన గూగుల్‌ క్రోమ్‌..!

మరిన్ని వార్తలు