Nikon India: సమస్యలు ఉన్నా.. తగ్గేదేలే మన టార్గెట్‌ 1,000కోట్లు!

10 Sep, 2022 14:46 IST|Sakshi

కోల్‌కతా: ఇమేజింగ్‌ ఉత్పత్తుల కంపెనీ నికాన్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.900 కోట్ల టర్నోవర్‌ సాధిస్తానన్న అంచనాతో ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలన్న లక్ష్యంతో ఉంది. ఈ వివరాలను నికాన్‌ ఇండియా ఎండీ సజ్జన్‌ కుమార్‌ వెల్లడించారు. సరఫరా పరంగా సమస్యలు ఉన్నా, తయారీ వ్యయాలు పెరిగి మార్జిన్లపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. పండుగల విక్రయాలను దృష్టిలో పెట్టుకుని ధరలను పెంచలేదని చెప్పారు. వార్షిక అమ్మకాల్లో 30–35 శాతం మేర ఓనమ్‌ నుంచి దీపావళి మధ్య నమోదవుతాయన్నారు.

కరోనా ముందస్తు అమ్మకాలను ఈ ఏడాది అధిగమిస్తామని చెప్పారు. కెమెరా మార్కెట్‌ వార్షిక పరిమాణం రూ.3,000 కోట్లుగా ఉంటుందన్నారు. సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్లు, నిపుణులే తమ ఉత్పత్తుల విక్రయాలకు మద్దతుదారులుగా చెప్పారు. సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్లు ఉపయోగించే ఆరంభ స్థాయి నుంచి మధ్య స్థాయి కెమెరాల విక్రయాల్లో 45 శాతం వృద్ధి ఉన్నట్టు తెలిపారు. విలువ పరంగా చూస్తే ఈ విభాగం వాటా ఇమేజింగ్‌ మార్కెట్లో 25 శాతం ఉంటుందన్నారు. ఈ విభాగంలో తమకు మార్కెట్‌ను శాసించే ‘నికాన్‌ జెడ్‌ 30’ కెమెరా ఉన్నట్టు ప్రకటించారు. నిపుణులు వినియోగించే కెమెరాల విక్రయాల్లోనూ 20 శాతం వృద్ధి ఉందని సజ్జన్‌ కుమార్‌ తెలిపారు.

చదవండి: ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్‌ చేస్తే 75 కోట్ల టర్నోవర్‌

మరిన్ని వార్తలు