రూపాయి : ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక వ్యాఖ్యలు

23 Jul, 2022 09:43 IST|Sakshi

రూపాయికి ఓ లక్ష్యాన్ని పెట్టుకోలేదు 

అస్థిరతలను చూస్తూ కూర్చోం 

ద్రవ్యోల్బణం నియంత్రణకే మొదటి ప్రాధాన్యం

తర్వాత వృద్ధికి మద్దతు 

ముంబై: వర్ధమాన కరెన్సీలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా నిలబడిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. డాలర్‌తో రూపాయి 80కు పడిపోవడం, రానున్న రోజుల్లో ఇంకొంత క్షీణిం చొచ్చంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ అంశంపై స్పందించారు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. రూపాయిలో అస్థిరతలు, ఎత్తు పల్లాలను ఆర్‌బీఐ చూస్తూ కూర్చోదని స్పష్టం చేశారు. సెంట్రల్‌ బ్యాంకు చర్యల వల్లే రూపాయి ప్రయాణం సాఫీగా ఉందన్నారు. రూపాయి ఈ స్థాయిలో ఉండాలనే ఎటువంటి లక్ష్యాన్ని ఆర్‌బీఐ పెట్టు కోలేదని స్పష్టం చేశారు. మార్కెట్‌కు యూఎస్‌ డాలర్లను సరఫరా చేస్తూ తగినంత లిక్విడిటీ ఉండేలా చూస్తున్నట్టు చెప్పారు. విదేశీ రుణాలకు సంబంధించి హెడ్జింగ్‌ చేయకపోవడంపై ఎటువంటి హెచ్చరికలు అవసరం లేదన్నారు.

విదేశీ రుణాల్లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ప్రభుత్వరంగ సంస్థలకే ఉందని చెబుతూ.. అవసరమైతే ప్రభుత్వం సాయంగా నిలుస్తుందన్నారు. 2016లో ద్రవ్యోల్బణం నియంత్రణకు సంబంధించి చేపట్టిన కార్యాచరణ మంచి ఫలితాలను ఇచ్చిందంటూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్‌ రంగ ప్రయోజనాల రీత్యా దీన్నే కొనసాగిస్తామని శక్తికాంతదాస్‌ తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి పరిమితం చేయాలన్నది ఈ కార్యాచరణలో భాగం. ప్రతికూల సమయాల్లో దీనిని ప్లస్‌2, మైనస్‌2 దాటిపోకుండా చూడడం లక్ష్యం.   

ఆర్థిక వ్యవస్థ సాఫీగా.. 
‘‘నిర్ణీత కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ కుదురుకునేలా చూడాలన్నదే మా ప్రయత్నం. అదే సమయంలో వృద్ధిపై పరిమిత ప్రభావం ఉండేలా చూస్తాం’’అని ఆర్‌బీఐ గవర్నర్‌ భరోసా ఇచ్చారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్టాలను తాకిందంటూ, ఆగస్ట్‌లో జరిగే ఎంపీసీ భేటీలో 2022–23 సంవత్సరానికి సంబంధించి 6.7 శాతం ద్రవ్యోల్బణం అంచనాలను సమీక్షిస్తామని చెప్పారు. యూరోప్‌లో (ఉక్రెయిన్‌పై) యుద్ధం కారణంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. కమోడిటీ ధరలు, చమురు ధరలు పెరిగి పోయాయి. వీటి ప్రభావం మనపై పడింది. అదే సమయంలో ఇతర సెంట్రల్‌ బ్యాంకులు మానిటరీ పాలసీని కఠిన తరం చేయడం వల్ల ఆ ప్రభావాలు మననూ తాకాయి. పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం, కరెన్సీ విలువ క్షీణత ఇవన్నీ ఆర్‌బీఐ నియంత్రణలో లేనివి. లిక్విడిటీ, పాలసీ రేట్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, వాటి ప్రభావం వృద్ధిపై, ఆర్థిక వ్యవస్థ రివకరీపై ఏ మేరకు ఉంటాయన్నది పరిగణనలోకి తీసుకునే చేస్తాం’’అని శక్తికాంతదాస్‌ వివరించారు. ప్రస్తుతం ఆర్‌బీఐముందున్న ప్రాధాన్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, తర్వాత వృద్ధికి మద్దతుగా నిలవడమేనని చెప్పారు 

లైసెన్స్‌ ఉన్న సేవలకే పరిమితం 
డిజిటల్‌ రుణ సంస్థలు లైసెన్స్‌ పొందిన సేవలకే పరిమితం కావాలని శక్తికాంతదాస్‌ సూచించారు. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనలు ఆమోదనీయం కాదని  తేల్చి చెచెప్పారు. లైసెన్స్‌ పరిధికి వెలుపల ఏ సేవలకు అయినా తమ ఆమోదం కోరాలని సూచించారు. ఆమోదం లేకుండా వీటిని నిర్వహించడం వల్ల వ్యవస్థలో రిస్క్‌ పెరుగుతుందంటూ, అందుకు తాము అవకాశం ఇవ్వబోమన్నారు. ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్లను జారీ చేసే నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థలు వ్యాలెట్లను, కార్డులను క్రెడిట్‌ సదుపాయాలతో లోడ్‌ చేసుకోవడం కుదరదంటూ ఆర్‌బీఐ గత నెలలో ఆదేశించడం గుర్తుండే ఉంటుంది. ‘‘ఆవిష్కరణలకు సెంట్రల్‌ బ్యాంకు మద్దతు ఇస్తుంది. కానీ, అదే సమయంలో మొత్తం వ్యవస్థ ఒక క్రమపద్ధతిలో, నియంత్రణల మధ్య వృద్ధి చెందాల్సి ఉంటుంది. అందుకని ఆర్థిక స్థిరత్వం విషయంలో రాజీపడేది లేదు’’అని ఆర్‌బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు. నియంత్రణలో లేని, లైసెన్స్‌లు లేని ఎన్నో సంస్థలు ఎన్నో రకాల రుణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు దాస్‌ చెప్పారు. ‘‘ఈ అంశంలో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు చేసింది. వాటిని పరిశీలించాం. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తాం’’అని తెలిపారు.         

మరిన్ని వార్తలు