నోర్టన్‌ ల్యాబ్స్‌ హెచ్చరిక! ఏమరుపాటుగా ఉంటే అంతే సంగతులు

8 Nov, 2021 08:29 IST|Sakshi

బెంగళూరు: సెలవుల సీజన్‌లో టెక్‌ సపోర్ట్‌ స్కాములు మరింతగా పెరగనున్నాయి. అలాగే షాపింగ్, విరాళాల సేకరణ రూపంలో ఫిషింగ్‌ దాడుల ముప్పు కూడా పొంచి ఉందని నోర్టన్‌ ల్యాబ్స్‌ హెచ్చరించింది. ఇటీవల ఆ సంస్థ రూపొందించిన వినియోగదారుల సైబర్‌ భద్రత నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పేరొందిన టెక్నాలజీ కంపెనీల నుంచి వచ్చినట్లుగా అనిపించే 1.23 కోట్ల పైచిలుకు మోసపూరిత టెక్‌ సపోర్ట్‌ యూఆర్‌ఎల్స్‌ను బ్లాక్‌ చేసినట్లుగా నోర్టన్‌ తెలిపింది.

1.72 కోట్ల సైబరు దాడులు
కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలో వినియోగదారులు తమ ఉద్యోగ విధులను, కుటుంబ బాధ్యతల నిర్వహణకు డివైజ్‌లపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడంతో టెక్‌ సపోర్ట్‌ స్కాముల బెడద మరింత పెరిగిందని వివరించింది. గత త్రైమాసికంలో కేవలం భారత్‌లోనే 1,72,14,929 పైచిలుకు సైబర్‌ దాడులను తాము అడ్డుకోగలిగినట్లు పేర్కొంది.

భయాన్ని పెంచి
వినియోగదారుల్లో భయం, అనిశ్చితి, సందేహాలు రేకెత్తించడంలో టెక్‌ సపోర్ట్‌ స్కాములు.. అత్యంత సమర్ధమంతంగా పనిచేస్తాయని వివరించింది. తమ సైబర్‌ భద్రతకు పెను ముప్పు ఉందని వినియోగదారులను ఇవి భయపెట్టగలవని పేర్కొంది. ఫిషింగ్‌ దాడుల్లో భాగంగా సిసలైన బ్యాంకు పోర్టల్స్‌గా భ్రమింపచేసే వెబ్‌సైట్ల లింకులను పంపించి, ఆయా బ్యాంకుల కస్టమర్లను నేరగాళ్లు ఏమారుస్తున్నారని వివరించింది. వారి వివరాలను తస్కరించి, మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. క్రెడిట్‌ కార్డుల స్థాయిలో భద్రత ఉండని గిఫ్ట్‌ కార్డులకు ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉండవచ్చని నోర్టన్‌ వివరించింది.  
చదవండి:4 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా లీక్‌: సైబర్‌ఎక్స్‌9

మరిన్ని వార్తలు