ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలు దారులకు శుభవార్త!

16 Aug, 2022 07:08 IST|Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ తాజాగా ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. 2024 నాటికి తొలి మోడల్‌ను ఆవిష్కరించనుంది. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్‌ అగర్వాల్‌ ఈ విషయాలు తెలిపారు. 2026–27 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. 

రూ. 1 లక్ష నుంచి రూ. 50 లక్షల ధరల రేంజిలో ఎలక్ట్రిక్‌ టూ–వీలర్లు, కార్ల శ్రేణిని అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకున్నట్లు అగర్వాల్‌ చెప్పారు. ‘ముందుగా ప్రీమియం కారుతో మొదలుపెడుతున్నాం. ఇది 18–24 నెలల్లో వస్తుంది. ఎంట్రీ స్థాయి కార్లను కూడా కచ్చితంగా ప్రవేశపెడతాం‘ అని ఆయన పేర్కొన్నారు.

ఓలా ఎలక్ట్రిక్‌ కారుకు ఒకసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్ల పైగా నడిచే సామర్థ్యం ఉండగలదని, 4 సెకన్లలోనే 0–100 కి.మీ. వేగాన్ని అందుకోగలదని అగర్వాల్‌ చెప్పారు. ఓలా గతేడాదే ఎస్‌1, ఎస్‌1 ప్రో మోడల్స్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 

భారీ విక్రయాల లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ.. ఉత్పత్తి, డెలివరీల విషయంలో సమస్యలతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఎలక్ట్రిక్‌ కార్ల ప్రాజెక్టు కోసం 1,000 మందిని తీసుకుంటున్నట్లు అగర్వాల్‌ తెలిపారు. కాగా, ఎస్‌1 ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విక్రయాలను తిరిగి ప్రారంభిస్తున్నామని, సెప్టెంబర్‌ 7 నుంచి డెలివరీలు ఉంటాయని సంస్థ తెలిపింది. 

చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!

మరిన్ని వార్తలు