రూ 2000 నోటు మార్చుకుంటున్నారా?, సర్వీస్‌ ఛార్జీలు వసూలు​ చేస్తున్న బ్యాంక్‌లు!

23 May, 2023 17:26 IST|Sakshi

ప్రజలు నేటి నుంచి రూ.2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ఎదుట బారులు తీరారు. అయితే నోట్లను మార్చుకుంటే బ్యాంక్‌లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవని ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంక్‌ ఖాతాలో జరిగే డిపాజిట్లపై సాధారణ నిబందనలే వర్తిస్తాయని తెలిపింది. దీంతో బ్యాంక్‌లు రూ.2000 నోట్ల డిపాజిట్లపై సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.  

ఎక్కువ శాతం బ్యాంక్‌లు ప్రతి రోజు జరిగే డిపాజిట్లు, విత్‌ డ్రాయిల్స్‌పై లిమిట్‌ దాటితే అదనపు ఛార్జీలు విధిస్తాయి. ఇప్పుడా ఛార్జీలు రూ.2000 డిపాజిట్లపై వర్తించనున్నాయి. ఆ ఛార్జీలు వివిధ బ్యాంక్‌ల‍్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎస్‌బీఐ బ్యాంక్‌ సర్వీస్‌ ఛార్జీలు 
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఎస్‌బీఐ సేవింగ్‌ అకౌంట్‌, సురభి సేవింగ్స్‌ అకౌంట్లలో నెలలో మూడుసార్లు డిపాజిట్లను ఉచితంగా చేసుకోవచ్చు. ఆపై జరిపే ప్రతి డిపాజిట్‌పై రూ.50 ప్లస్‌ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ హోం బ్రాంచ్‌లో కాకుండా మిగిలిన బ్రాంచ్‌లలో ప్రతి రోజు రూ.2లక్షలు డిపాజిట్‌ చేయొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో బ్రాంచ్‌ మేనేజర్‌ అనుమతితో రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అదనపు ఛార్జీలు పడతాయి. డిపాజిట్‌ మెషిన్‌లో క్యాష్‌ డిపాజిట్‌ ఉచితంగా చేయొచ్చు. కానీ, డెబిట్‌ కార్డ్‌ను ఉపయోగించి థర్డ్‌ పార్టీ అకౌంట్‌ల ద్వారా క్యాష్‌ డిపాజిట్‌ చేస్తే మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.22 ప్లస్‌ జీఎస్టీని వసూలు చేస్తారు బ్యాంక్‌ అధికారులు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సర్వీస్‌ ఛార్జీలు 
హెచ్‌డీఎఫ్‌సీ ప్రతి నెల నాలుగు ట్రాన్సాక్షన్‌ల వరకు ఉచితంగా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. వాటిల్లో మీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి లేదంటే థర్డ్‌ పార్టీ ద్వారా విత్‌ డ్రాయిల్‌ చేసుకుంటే ఎలాంటి ఛార్జీల్ని వసూలు చేయదు. అయితే, నిర్ధేశించిన లిమిట్‌ దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.150 వరకు చెల్లించాల్సి ఉంటుంది. నెలలో చేసే డిపాజిట్‌ రూ. 2 లక్షలకు మించితే, ప్రతీ వెయ్యి రూపాయలకు రూ.5 నుంచి గరిష్టంగా రూ.150 ప్లస్‌ జీఎస్టీ చెల్లించాలి. ఇక, థర్డ్‌ పార్టీ క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ రోజుకు రూ.25,000 వరకు చేసుకోవచ్చు. కార్డ్‌ బేస్డ్‌ డిపాజిట్లను రూ.1లక్ష వరకు చేసుకోవచ్చు. సేవింగ్‌ అకౌంట్‌లో డిపాజిట్లు రోజుకు రూ.2 లక్షల వరకు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి బ్యాంక్‌లు. 

ఐసీఐసీఐ బ్యాంక్‌ సర్వీస్‌ ఛార్జీలు 
ఐసీఐసీఐ బ్యాంక్‌ నెలలో నాలుగు క్యాష్‌ ట్రాన్సాక్షన్‌లను ఫ్రీగా చేసుకోవచ్చు. వాటిలో డిపాజిట్లు, విత్‌ డ్రాయిల్స్‌ ఉన్నాయి. లిమిట్‌ దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ.150 చెల్లించాలి. నెలలో రూ.1లక్షల వరకు సేవింగ్‌ అకౌంట్‌లో ఉచితంగా డిపాజిట్‌ చేసుకునే వీలుంది. లిమిట్‌ దాటితే రూ.1000కి రూ.5 నుంచి గరిష్టంగా రూ.150 వరకు ఛార్జీలు వసూలు చేయనునున్నట్టు వెబ్‌సైట్లో పేర్కొంది. 

ఇక, హోం బ్రాంచ్‌ కాకుండా వేరే బ్రాంచ్‌ బ్యాంక్‌ రూ.1000 రూ.5, రూ.25,000 దాటితే రోజుకు రూ.150 అదనపు ఛార్జీలు చెల్లించాలి. థర్డ్‌ పార్టీ ట్రాన్సాక్షన్‌లు రూ.25,000కే పరిమితం చేసింది. ఇంకా, ప్రతి థర్డ్-పార్టీ లావాదేవీకి బ్యాంక్ రూ.150 సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తుంది. పైన పేర్కొన్న ఈ ఛార్జీలు హోమ్ బ్రాంచ్‌కు (ఖాతా తెరిచిన లేదా పోర్ట్ చేయబడిన బ్రాంచ్), బ్రాంచ్‌లలో డిపాజిట్లు, విత్‌ డ్రాయిల్‌, రీసైక్లర్ మెషీన్‌లలోని డిపాజిట్లకు వర్తిస్తాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు
కోటక్ మహీంద్రా బ్యాంక్ విత్‌ డ్రాయిల్‌, డిపాజిట్లు లేదా రూ. 3 లక్షలతో సహా ఐదు ఉచిత లావాదేవీలను అనుమతిస్తుంది. మీరు ఈ పరిమితిని దాటిన తర్వాత, బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు రూ. 1000కి రూ. 4.5 లేదా కనిష్టంగా రూ. 150 సర్వీస్ ఛార్జీని చెల్లించాలి. ఈ ఛార్జీలు బ్రాంచ్ లేదా క్యాష్ డిపాజిట్ మెషీన్‌లో నగదు లావాదేవీలకు వర్తిస్తాయి. అదేవిధంగా, ఇతర బ్యాంకులు కూడా మీ ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడానికి నిర్దిష్ట ఛార్జీలను విధించవచ్చు.

చదవండి👉రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి!

మరిన్ని వార్తలు