ఆఫ్‌లైన్‌ చెల్లింపులకూ గ్రీన్‌సిగ్నల్‌..

4 Jan, 2022 08:35 IST|Sakshi

ఆర్‌బీఐ నిర్ణయం తక్షణమే అమల్లోకి 

నెట్‌ కనెక్టివిటీ లేని ప్రాంతాల వారికి అనుకూలం 

ముంబై: గ్రామీణ, చిన్న పట్టణాల్లో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా ఆర్‌బీఐ ఆఫ్‌లైన్‌ చెల్లింపుల సేవల అమలుకు కార్యాచరణను ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోయినా లేదా కనెక్టివిటీ సరిగ్గా లేని చోట్ల.. ఆఫ్‌లైన్‌లో డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పించినట్టయింది. ఆఫ్‌లైన్‌ విధానంలో చెల్లింపులను ప్రాక్సిమిటీ మోడ్‌ (ఫేస్‌ టు ఫేస్‌) విధానంలో నిర్వహిస్తారు. కార్డులు, వ్యాలెట్లు, మొబైల్‌ డివైజెస్‌లతో ఈ విధానంలో చెల్లింపులు చేసుకోవచ్చు. కనుక ఈ లావాదేవీలకు అదనపు ఫ్యాక్టర్‌ ఆఫ్‌ ఆథెంటికేషన్‌ (మరో అంచె ధ్రువీకరణ) అవసరం ఉండదని ఆర్‌బీఐ తెలిపింది. 

రూ.200
ఒక్కో లావాదేవీ పరిమితి రూ.200 వరకు, మొత్తం మీద అన్ని లావాదేవీలకు గరిష్ట పరిమితి రూ.2,000 వరకే ఉంటుందని (తిరిగి ఆన్‌లైన్‌ ద్వారా బ్యాలన్స్‌ను నింపుకునే వరకు) పేర్కొంది. 2020 సెప్టెంబర్‌ నుంచి 2021 జూన్‌ మధ్య దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఆర్‌బీఐ పరీక్షించింది. ‘‘బలహీనమైన నెట్‌వర్క్‌ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో డిజిటల్‌ చెల్లింపులు పెంచేందుకు ఆఫ్‌లైన్‌ లావాదేవీలు తోడ్పడతాయి. నూతన విధానం తక్షణమే అమల్లోకి వస్తుంది’’ అని ఆర్‌బీఐ ప్రకటించింది. కస్టమర్‌ ఆమోదంతో ఆఫ్‌లైన్‌ చెల్లింపుల విధానాన్ని యాక్టివేట్‌ చేయొచ్చని తెలిపింది. ఈ విధానంలోనూ కస్టమర్‌కు లావాదేవీల పరంగా రక్షణ ఉంటుందని (కస్టమర్‌ ప్రమేయం లేని సందర్భాల్లో) స్పష్టం చేసింది.
 

చదవండి: ఫినో బ్యాంకు.. అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్‌ సేవలు

మరిన్ని వార్తలు