Bully Boy App: అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ మహిళ ఫిర్యాదు

4 Jan, 2022 08:26 IST|Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): తమపై బుల్లి బాయ్స్‌ పేరుతో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా, అమ్మకానికి పెడుతున్నట్లు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టోలిచౌకికు చెందిన ఓ మహిళ సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గిట్‌హాబ్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో సులీ డీల్స్‌ పేరుతో ఖాతా తెరిచి ఆ తరువాత దానిని బుల్లీ బాయ్స్‌గా పేరు మార్చారు. ఇందులో ముస్లిం మహిళలను విక్రయిస్తున్నట్లు పోస్టులు పెట్టారు.

దీనిపై ట్విట్టర్‌లో దుమారం రేగడంతో ఢిల్లీ, ముంబాయి సైబర్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న బాధితురాలి ఫోటోను కూడా అలాగే ఆ పోస్టులో పెట్టడంతో బాధితురాలు తాజాగా సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై 509, 354డీ, 67 ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. ఇదిలా ఉండగా మరో మహిళ సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసింది.  

మరిన్ని వార్తలు