ఆర్‌ఐఎల్‌ బోర్డులో అరామ్‌కో చైర్మన్‌

22 Oct, 2021 06:19 IST|Sakshi

అనుమతించిన వాటాదారులు

న్యూఢిల్లీ: కంపెనీ బోర్డులో సౌదీ ఇంధన దిగ్గజం అరామ్‌కో గ్రూప్‌ చైర్మన్‌ యాసిర్‌ అల్‌రుమయాన్‌ను నియమించే ప్రతిపాదనకు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) వాటాదారులు తాజాగా ఆమోదముద్ర వేశారు. మూడేళ్ల కాలానికి యాసిర్‌ నియామకాన్ని సమర్దిస్తూ 98.03 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఆర్‌ఐఎల్‌ తాజాగా వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా కేవలం 2 శాతానికిలోపే ఓట్‌ చేసినట్లు తెలియజేసింది. 1.96 శాతానికి సమానమైన 10.89 కోట్ల షేర్లు తీర్మానానికి వ్యతిరేకంగా నిలిచినట్లు వెల్లడించింది.

కాగా.. యూఎస్‌ రీసెర్చ్‌ సలహా సంస్థ గ్లాస్‌ లెవీస్‌ సిఫారసు మేరకు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు చేసేందుకు గత నెలలో కాలిఫోర్నియా స్టేట్‌ టీచర్స్‌ రిటైర్‌మెంట్‌ సిస్టమ్‌(కాల్‌ఎస్‌టీఆర్‌ఎస్‌) నిర్ణయించిన విషయం విదితమే. యాసిర్‌.. సౌదీ అరేబియా పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(పీఐఎఫ్‌)కు గవర్నర్‌ కావడంతో ఆర్‌ఐఎల్‌ వాటాదారుగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇప్పటికే  పీఐఎఫ్‌.. రిలయన్స్‌ రిటైల్‌లో రూ. 9,555 కోట్లు, జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 11,367 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. కాగా.. ఆర్‌ఐఎల్‌కు చెందిన ఆయిల్‌ టు కెమికల్స్‌ బిజినెస్‌లో అరామ్‌కో 20 శాతం వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలకుతోడు, శుక్రవారం(నేడు) క్యూ2 ఫలితాల నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేరు  3 శాతం క్షీణించి రూ. 2,623 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు