కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్‌.. సెబీ సీరియస్‌

2 Oct, 2021 20:54 IST|Sakshi

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మరోసారి చిక్కుల్లో పడ్డారు. యోగా క్లాసుల సందర్భంగా ఆయన చెప్పిన ఆర్థిక పాటాలపై సెబీ సీరియస్‌ అయ్యింది. అభ్యంతర వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలంటూ వివరణ అడిగింది. 

ఈ షేర్లు కొనండి కరోడ్‌పతి కండి
ఇటీవల యోగా తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి బాబా రామ్‌దేవ్‌ ప్రసంగించారు. ‘ ఈ సందర్భంగా మీ అందరికీ కోటీశ్వరులు అయ్యే మంత్రం చెబుతాను జాగ్రత్తగా వినండి. మీరంతా ఈ రోజే డీ మ్యాట్‌ అకౌంట్స్‌ ఓపెన్‌ చేయండి. స్టాక్‌ మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించేందుకుద అన్నీ ఏర్పాట్లు చేసుకోండి. నేను చెప్పినప్పుడు రుచి సోయా కంపెనీకి చెందిన షేర్లు కొనండి. అలా కొన్న వాటిని తిరిగి అమ్మడం , కొనడం వంటి పనులు చేయకండి. వాటిని కొన్న వెంటనే ‘సమాధి’ చేయండి. ఎక్కువ కాలం మీ దగ్గరే ఉంచుకోండి. పతంజలి తర్వాత లక్ష కోట్ల రూపాయల కంపెనీ అయ్యే అర్హతలు రుచి సోయాకు ఉన్నాయి’ అంటూ చెప్పారు. 

సెబీ సీరియస్‌
స్టాక్‌ మార్కెట్‌లో జరిగే లావాదేవీలను సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) సంస్థ నిర్వహిస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం సరైన నైపుణ్యం, సర్టిఫైడ్‌కాని వ్యక్తులు షేర్ల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన సలహాలు ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మార్కెట్‌పై అవగాహన లేని వారు తమ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కానీ బాబా రామ్‌దేవ్‌ ఈ నిబంధనను పట్టించుకోకుండా బహిరంగగా సలహా ఇవ్వడంపై సెబీ సీరియస్‌ అయ్యింది. దీనిపై రామ్‌దేవ్‌ బాబాను వివరణ కోరింది.

సోయా రుచికి నోటీసులు
రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి సంస్థ సోయారుచికి ప్రమోటర్‌గా ఉంది. ఇటీవల అదనపు నిధులు మార్కెట్‌ నుంచి సమీకరించేందుకు ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో)కి వెళ్లేందుకు ఆగస్టులో సెబీ నుంచి అనుమతులు సాధించింది. త్వరలో ఈ సంస్థ ఎఫ్‌పీవో ద్వారా రూ. 4300 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. అయితే ఇంతలో రామ్‌దేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలు ఈ సంస్థను చిక్కుల్లో పడేశాయి. రుచితో పాటు ఎప్‌పీవోకి మర్చంట్‌బ్యాంకర్లు  ఉన్న వారికి సెబీ నోటీసులు జారీ చేసింది. 

లభించని వీడియో
కరోడ్‌పతి మంత్ర, సోయా రుచి షేర్లకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు రావడం తప్పితే సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా లభించడం లేదు. అయితే యోగా తరగతుల్లో బాబా మాట్లాడే సమయంలో కొందరు వీడియో తీశారని, ఆ ఫుటేజీ సెబీకి చేరిందని తెలుస్తోంది. సెబీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత ఆ వీడియోను తొలగించినట్టు సమాచారం. 

చదవండి : IIFL Wealth Hurun India 2021: ఆనంద్‌ మహీంద్రా, రాకేశ్‌ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..!

మరిన్ని వార్తలు