Snapchat కొత్త ఫీచర్‌: వారికి గుడ్‌ న్యూస్‌, నెలకు రూ. 2 లక్షలు

8 Nov, 2022 15:58 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే పాపులర్‌ ఫొటో మెసేజింగ్‌ ట్‌యాప్ స్నాప్‌చాట్‌ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రకటించింది. భారతదేశంలో స్నాప్‌చాట్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్‌ను ప్రారంభించినట్లు స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్మంగళవారం ప్రకటించింది. ఇందుకు  డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ డిస్ట్రోకిడ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా నెలకు 20 మంది బడ్డింగ్‌ ఆర్టిస్టులకు ఒక్కొక్కరికి 2,500 (దాదాపు రూ. 2,04,800) ప్రోత్సాహాన్ని అందించనుంది. 

కొత్తగా ప్రకటించిన స్నాప్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్ ద్వారా దేశంలోని అభివృద్ధి చెందుతున్న కళాకారులను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలను అందించనుంది. నెలకు మొత్తంగా 50వేల డాలర్ల (దాదాపు రూ.41 లక్షలు) వరకు గ్రాంట్‌లను అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తు కళాకారులే లక్ష్యంగా ప్లాట్‌ఫారమ్‌లోని స్నాప్‌లు, ఇతర క్రియేషన్‌లకు లైసెన్స్ పొందిన సంగీతాన్ని జోడించేలా సౌండ్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. నవంబర్ మధ్య నాటికి ఈ గ్రాంట్‌ ప్రోగ్రాం షురూ అవుతుందని అంచనా. స్నాప్‌చాట్‌ సౌండ్స్ ఫీచర్‌ మ్యూజిక్‌ వీడియోలు 2.7 బిలియన్లకు పైగా క్రియేట్‌ అయ్యాయని, వీటిని 183 బిలియన్లకు పైగా వీక్షించారని కంపెనీ తెలిపింది.

కాగా ఈ ఏడాది ఆగస్టులో స్నాప్‌చాట్+సబ్‌స్క్రిప్షన్‌ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా యూజర్లు ప్రత్యేకమైన ప్రయోగాత్మక, ప్రీ-రిలీజ్ ఫీచర్లకు ముందస్తుగానే యాక్సెస్‌ పొందొచ్చు. అంతేకాదు దేశంలో స్నాప్‌చాట్ ప్లస్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.49గా  నిర్ణయించగా, యూఎస్‌లో ప్లస్ సర్వీస్‌కు నెలకు 3.99 డాలర్లు ( సుమారు రూ.330) వసూలు చేస్తోంది.

>
మరిన్ని వార్తలు