వచ్చేస్తోంది..టయోటా, మారుతి సుజుకి సంయుక్తంగా రూపొందించిన ఎలక్ట్రిక్‌ కారు..! రేంజ్‌లో అదుర్స్‌..!

10 Apr, 2022 16:01 IST|Sakshi

పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ ఆందోళనల కారణంగా...ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారించాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆయా ఎలక్ట్రిక్‌ కార్లను మార్కెట్లలోకి రిలీజ్‌ చేశాయి. ఇక భారత్‌లో కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం కూడా ఊపందుకుంది. భారత ఆటోమొబైల్‌ మార్కెట్లను టార్గెట్‌ చేస్తూ పలు దిగ్గజ కంపెనీలు వినూత్న ఎలక్ట్రిక్‌ మోడళ్ల తయారీపై దృష్టి పెట్టాయి. కాగా టయోటా, మారుతి సుజుకి సంస్థలు ఒక అడుగు ముందుకేసి మిడ్‌సైజ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కారును భారత్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోన్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రెండు ఎలక్ట్రిక్‌ కార్లను తయారుచేస్తున్నాయి. 

డిజైన్‌ విషయానికి వస్తే..!
టయోటా, మారుతి సుజుకి సంయుక్తంగా రూపొందించిన మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ కారు డిజైన్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ వాహనం 2.7 మీటర్ల వీల్‌బేస్‌తో 4.3 మీటర్ల పొడవు ఉండవచ్చునని తెలుస్తోంది. అంటే భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ టాటా నెక్సాన్ ఈవీ కంటే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం ఎంజీ మోటార్స్‌  లాంచ్‌ చేసిన  జెడ్‌ఎస్‌ ఈవీతో సమానమైన పరిమాణంలో ఉండవచ్చు. స్థానిక , అంతర్జాతీయ మార్కెట్ల కోసం, సుజుకి ఈ రెండు మోడళ్లను దాని గుజరాత్ ఫెసిలిటీలో నిర్మిస్తుందని సమాచారం. ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ పొడవైన వీల్‌బేస్ కారణంగా, క్యాబిన్ మరింత విశాలంగా ఉండనుంది. సెక్యూర్డ్‌ బ్యాటరీ ప్యాకేజింగ్‌తో రానుంది.  మాడ్యులర్ eTNGA ప్లాట్‌ఫారమ్‌తో కూడిన డెడికేటెడ్ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్‌తో వచ్చే అవకాశం ఉంది. 


 

ధర ఎంతంటే..?
భారత్‌లో మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ వాహనాలు భారీ ఆదరణను పొందాయి. టయోటా, మారుతి సుజుకీ సంయుక్తంగా రూపొందిస్తోన్న మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ భారత ఈవీ మార్కెట్లలో తొలి కారుగా నిలుస్తోంది. ఈ రెండు కంపెనీలు తయారు చేస్తోన్న కారు ధర రూ. 13 నుంచి 15 లక్షల(ఎక్స్‌షోరూమ్‌)గా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

రేంజ్‌ ఎంతంటే..?
ఈ కారులో రెండు రకాల బ్యాటరీ వేరియంట్స్‌తో వచ్చే అవకాశం ఉంది. 48 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో కూడిన సింగిల్ 140పీఎస్‌ శక్తిని, ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారుని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 59 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ, 172 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తోంది. ఈ కారు సుమారు రియల్‌టైంలో 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సమాచారం. 

చదవండి: కళ్లు చెదిరే లుక్స్‌తో హల్‌చల్‌ చేస్తోన్న మారుతి సుజుకి నయా కారు..! లాంచ్‌ ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు