ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు!

26 Aug, 2021 07:21 IST|Sakshi

న్యూఢిల్లీ: మధ్యాదాయ వర్గాల్లో 60 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో ఇళ్ల ధరలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. నైట్‌ఫ్రాంక్‌ నిర్వహించి న ఒక సర్వేలో ఈ విషయం తెలిసింది. 30 శాతం మంది 9 శాతం వరకు ధరలు పెరుగుతాయని భావిస్తుంటే.. 25 శాతం మంది 10–19 శాతం మధ్య ధరలు పెరగొచ్చని చెప్పారు. రేట్ల పెరుగుదల 20 శాతం కంటే ఎక్కువే ఉండొచ్చని 6 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

ఇళ్ల కొనుగోలు దారులపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని ‘గ్లోబల్‌ బయ్యర్‌ సర్వే’లో భాగంగా నైట్‌ఫ్రాంక్‌ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా భారత్‌లోనూ 550మందికిపైగా అభిప్రాయాలు తెలుసుకుంది. రెండు భాగాలుగా నిర్వహించిన సర్వేలో అధిక ఆదాయం కలిగిన వారి నుంచి, మధ్యస్థ ఆదాయం కలిగిన వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. 

నివేదికలో ప్రస్తావించిన అంశాలు
 

♦ 26 శాతం మంది భారతీయులు కరోనా వచ్చిన తర్వాత తమ నివాసాలను మార్చేశారు. మరింత విశాల స్థలం కోసం ఈ పనిచేశారు.
 
♦ వచ్చే 12 నెలల్లో తమ నివాసాలను మార్చాలనుకుంటున్న వారు 32 శాతం మంది ఉన్నారు.
 
♦ ఇళ్లు మారిపోవాలనుకుంటన్న వారిలో 87 శాతం మంది ప్రస్తుత పట్టణాల మధ్యలో ఉండడం కంటే.. పట్టణ పొరుగు ప్రాంతాల్లో ఉండేందుకు సుముఖత చూపిస్తున్నారు.
 
♦ 13 శాతం మంది అయితే ఇతర పట్టణాలకు మారిపోయే ఆలోచనలో ఉన్నారు.
 
♦ అన్ని నియంత్రణలు ఎత్తివేస్తే తిరిగి కార్యాలయాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో సగానికిపైనే చెప్పారు.
 
♦ 47 శాతం మంది వారంలో 2–4 రోజులు కార్యాలయాల నుంచి పనిచేయవచ్చని చెప్పారు.
   
♦ భవిష్యత్తులో పని విధానం అన్నది వాణిజ్య భవనాలే కాకుండా నివాస భవనాలపైనా గణనీయమైన ప్రభావం చూపిస్తుందని ఈ సర్వే నివేదిక తేల్చింది.  

చదవండి : కార్ల అమ్మకాలు..ఈ ఫీచర్‌కే జై కొడుతున్నారు

మరిన్ని వార్తలు