‘ఇందిరమ్మ’ ఇళ్లకు కొత్తగా దరఖాస్తులు | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ ఇళ్లకు కొత్తగా దరఖాస్తులు

Published Thu, Dec 21 2023 12:48 AM

-

మోర్తాడ్‌(బాల్కొండ) : పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చే క్రమంలో భాగంగా వారి నుంచి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరోసారి గ్రామసభల ద్వారా దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఎన్నికలకు ముందు నియోజకవర్గానికి 3 వేల మందికి గృహలక్ష్మి ప్రొసీడింగ్‌ను జారీ చేశారు. వీటిని అధికార యంత్రాంగం కాకుండా అప్పటి అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులుగా ఎంపికై న వారికి పంపిణీ చేశారు. సొంతంగా జాగా ఉండి ఇళ్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షల సాయాన్ని మూడు విడతల్లో అందించనున్నట్లు గత ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాలో గృహలక్ష్మి పథకం కింద 25 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ 16,500 మందికి సాయం అందించేందుకు మాత్రమే నిధులున్నాయిని పేర్కొంటూ ప్రొసీడింగ్‌ కాపీలను జారీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఎంపీడీవోలు జారీ చేసినట్లు ప్రొసీడింగ్‌ కాపీలు ఉన్నాయి. వాటిపై ఏ ఒక్క అధికారి సంతకం లేకపోవడం గమనార్హం. కాగా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం గృహలక్ష్మి సాయాన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకం సాయానికి తేడాను స్పష్టంగా పేర్కొంది. ఓసీ, బీసీలకు రూ. 5 లక్షల చొప్పున, ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షల చొప్పున సాయం అందించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది.

‘గృహలక్ష్మి’ అప్లికేషన్లను

పరిశీలించేది లేదన్న ప్రభుత్వం

గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్‌లు

చెత్తబుట్టపాలు

Advertisement
Advertisement