బందిపోట్ల అరాచకం.. 35 మంది గ్రామస్తుల బలి

10 Jul, 2021 21:17 IST|Sakshi

జంఫారా : వాయువ్య నైజీరియాలో బందిపోట్లు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. 35 మంది గ్రామస్తులను కాల్చి చంపారు. గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గురువారం బైకులపై ఆయుధాలతో వచ్చిన బందిపోట్లు అటవీ ప్రాంత గ్రామాలైన గిడన్‌, ఆదాము, సౌని, గిడన్‌ బౌసి, గిడన్‌ మైదావాలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కొన్ని ఇళ్లను తగులబెట్టారు. భద్రతాదళాలు అక్కడికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఈ దాడిలో 35 మంది గ్రామస్తులు చనిపోయారని పోలీసులు చెబుతుండగా.. 43 మంది మృతదేహాలను గుర్తించామని, మరికొంతమంది గాయపడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా, నైజీరియాలో బందిపోట్ల అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. తరుచుగా ఊళ్లపై పడి ప్రజలను బలితీసుకుంటున్నారు. గత గురువారం సౌవా గ్రామంపై దాడి చేసి 18మందిని చంపారు. గత నెలలో జంఫారా, జుర్మీ జిల్లాలోని ఓ ఆరు గ్రామాలపై దాడి చేసిన బందిపోట్లు దాదాపు 53 మందిని చంపేశారు.

మరిన్ని వార్తలు