Sakshi News home page

దైవదర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి..

Published Sat, Dec 23 2023 4:29 AM

Road accident at Elkaturthi in Hanumakonda district - Sakshi

ఎల్కతుర్తి/ఏటూరునాగారం: దైవదర్శనం కోసం కారులో వేములవాడ బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట, శాంతినగర్‌ సమీపంలో హనుమకొండ–కరీంనగర్‌ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటాక కారు, లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

రాత్రిపూట ప్రయాణంతో... 
ఎల్కతుర్తి ఎస్సై గోదారి రాజ్‌కుమార్‌ తెలిపిన కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన మంతెన శంకర్‌ (60), మంతెన భరత్‌ (29), మంతెన కాంతయ్య (72), మంతెన చందన (16)తోపాటు మంతెన రేణుక (55), మంతెన భార్గవ్, మంతెన శ్రీదేవి కలసి కారులో గురువారం రాత్రి ఏటూరునాగారం నుంచి వేములవాడకు బయలుదేరారు.

అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్‌ నుంచి పెంచికలపేట సమీపంలోకి రాగానే వరంగల్‌ వైపు వెళ్తున్న లారీ, కారు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అవడంతోపాటు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భరత్‌తోపాటు ఆయన తండ్రి శంకర్, మంతెన కాంతయ్య, ఆయన కుమార్తె చందన అక్కడికక్కడే మృతిచెందగా వెనుక సీటులో కూర్చున్న రేణుక, శ్రీదేవి, భార్గవ్‌లకు తీవ్ర గాయాలై కారులోనే ఇరుక్కుపోయారు.

సమాచారం తెలుసుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై రాజ్‌కుమార్‌ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనంలో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుక మృతిచెందింది. నిద్రమత్తు, అతివేగం, పొగ మంచు వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ పరారైనట్లు తెలిపారు. 

హనుమకొండలో షాపింగ్‌ చేసుకొని.. 
మంతెన శంకర్, కాంతయ్యలు వరుసకు అన్నదమ్ములు. శంకర్‌ కార్పెంటర్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య శ్రీదేవికాగా చిన్న కుమారుడు భరత్‌ టీఎస్‌ఎండీసీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా, పెద్ద కుమారుడు భార్గవ్‌ వాజేడులోని రెవెన్యూ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాంతయ్య కంసాలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య రేణుకకు చాలాకాలం తర్వాత చందన జన్మించింది.

అయ్యప్ప మాల ధరించిన శంకర్‌ చిన్న కుమారుడు భరత్‌కు మేడారం జాతర ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ కావడంతో దానిలో భాగంగానే శ్రీదేవి అక్క కొడుకుకు చెందిన కారును తీసుకొని కుటుంబ సభ్యులతో కలసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఏటూరునాగారం నుంచి వేములవాడకు బయలుదేరారు.

మార్గమధ్యంలో హనుమకొండలో షాపింగ్‌ చేసుకొని తిరిగి వేములవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై ములుగు జిల్లాకు చెందిన పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. 

Advertisement

What’s your opinion

Advertisement