నాన్నా.. లేవండి నాన్నా..! 

28 Jan, 2021 09:21 IST|Sakshi

 బైకును ఢీకొన్న డీసీఎం

మహేశ్వరం: నగరానికి వచ్చిన తండ్రీకొడుకు తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. తండ్రి బైకు నడుపుతుండగా కుమారుడు వెనుకాల కూర్చుకున్నాడు. ఇద్దరూ కుటుంబ విషయాలు, వ్యవసాయం గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.  అంతలోనే మృత్యువు రూపంలో వెనుక నుంచి దూసుకొచ్చిన డీసీఎం వీరి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి తీవ్రంగా గాయపడి మృతిచెందగా కొడుకుకు గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని శ్రీశైలం జాతీయ రహదారిపై మొహబ్బత్‌నగర్‌ గేటు సమీపంలో బుధవారం జరిగింది. సీఐ మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం లేమూర్‌ గ్రామానికి చెందిన వరికుప్పల జంగయ్య(50) తన కుమారుడు వరికుప్పల నర్సింహతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నగరం నుంచి స్వగ్రామానికి బైకుపై వెళ్తున్నారు. ఈక్రమంలో శ్రీశైలం రహదారిపై మండల పరిధిలోని మొహబ్బత్‌నగర్‌ గేటు సమీపంలో వీరి బైకును.. వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన జంగయ్య పైనుంచి డీసీఎం వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైకు వెనుకాల కూర్చున్న ఆయన కొడుకు నర్సింహకు గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో తండ్రి తన కళ్ల ఎదుటే మృతిచెందడంతో నర్సింహ గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. లేవండి.. నాన్నా.. ఇంటికి వెళ్దాం పదండి.. అయ్యో.. దేవుడా.. అంటూ నర్సింహ రోదించిన తీరు అక్కడున్న వారికి కంట తడి తెప్పించింది. ప్రమాదం జరగడంతో వాహనాలు స్తంభించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం వాహనాలను నియంత్రించారు. డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

   
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు