అకాలవర్షాలతో అంటువ్యాధులు | Sakshi
Sakshi News home page

అకాలవర్షాలతో అంటువ్యాధులు

Published Thu, Dec 7 2023 1:12 AM

కోనాడలో ఏర్పాటు చేసిన శిబిరంలో  మహిళకు బీపీ చెక్‌ చేస్తున్న వైద్యుడు  - Sakshi

వర్షపు నీరు నిల్వ ఉండకుండా

చూసుకోవాలి

నీరు నిల్వతో వ్యాధుల వ్యాప్తి

తీరప్రాంతంలో వైద్య శిబిరాల ఏర్పాటు

డీఎంహెచ్‌ఓ భాస్కరరావు

విజయనగరం ఫోర్ట్‌: మిచాంగ్‌ తుఫాన్‌ కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉంది. అదేవిధంగా తాగునీరు కలుషతమయ్యే ఆస్కారం ఉంది. దీనివల్ల అంటు వ్యాధులు ప్రబలే దుస్థితి ఉంది. ఇటువంటి సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తుఫాన్‌ నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వైద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వైద్యాధికారులు చర్యలు చేపడుతున్నారు.

డయేరియా, టైఫాయిడ్‌ ప్రబలే ఆస్కారం

ఇళ్లముందు, వీధుల్లో నీరు నిల్వ ఉండడం వల్ల మలేరియా, టైపాయిడ్‌, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది. వర్షపు నీరు తాగునీటి వనరుల్లో చేరడం వల్ల నీరు కలుషితమయ్యే పరిస్థితి ఉంది. అటువంటి నీటిని తాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్‌ వ్యాప్తి చెందవచ్చు. అదేవిధంగా వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల దోమల వ్యాప్తి అధికమవుతుంది. అవికుట్టడం వల్ల మలేరియా, డెంగీ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదముంది. అందువల్ల ఇంటి పరిసరాల్లోను వీధుల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

చర్యలు చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖ

తుఫాన్‌ నేపధ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో 8 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండేవిధంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. వైద్య శిబిరాల వద్ద అంటువ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉంచారు. వారం రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న గర్భిణులను సీహెచ్‌సీలో చేర్పించారు.

పీహెచ్‌సీల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

తుఫాన్‌ కారణంగా అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉన్నందున పీహెచ్‌సీల సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా వ్యాధులు వ్యాప్తి చెందినట్లయితే తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీటి వనరుల్లో వర్షపు నీరు చేరినందున వాటర్‌ టెస్టింగ్‌ చేయాలని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఓ)లను డీఎంహెచ్‌ఓ భాస్కర రావు ఆదేశించారు.

కాచి చల్లార్చిన నీటిని తాగాలి

వర్షాలు అధికంగా కురవడం వల్ల నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటిని తాగడం ద్వారా నూరుశాతం నీటి ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈగలు, దోమలు వాలే ఆహార పదార్థాలను తినకూడదు. ఇటువంటి వి తినడం వల్ల జిగట విరోచనాలయ్యే ప్రమాదం ఉంది. వారం రోజుల్లో ప్రసవించే అవకాశమున్న గర్భిణులను సీహెచ్‌సీలకు తరలించాం. వైద్య శిబిరాల్లో మందులు సిద్ధంగా ఉంచాం. డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, డీఎంహెచ్‌ఓ

కొత్తూరులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం
1/2

కొత్తూరులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం

2/2

Advertisement
Advertisement