కారులోనే చితిమంట..!

30 Jul, 2020 03:07 IST|Sakshi
దగ్ధమవుతున్న కారు ఇన్‌సెట్‌లో శివకుమార్‌(ఫైల్‌)

లారీని ఢీకొన్న కారు

ఎస్‌బీఐ ఉద్యోగి సజీవ దహనం

బొమ్మలసత్రం(నంద్యాల): తండ్రి అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి కారులో తిరిగొస్తున్న కుమారుడికి మృత్యువు లారీ రూపంలో ఎదురుపడింది. కష్టాలతో ప్రయాణం చేస్తున్న ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.  

అసలేం జరిగింది.. 
నంద్యాల రూరల్‌ సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని టెక్కె నాగులకట్ట వీధికి చెందిన దేశాయి రవికుమార్, ఉమాదేవి కుమారుడు శివకుమార్‌ (35)కు పుట్టుకతోనే పోలియో సోకడంతో రెండు కాళ్లూ పనిచేయవు. దివ్యాంగుడైనప్పటికీ బాగా చదువుకుని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్లర్క్‌ ఉద్యోగం సాధించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివకుమార్‌ తండ్రి సోమవారం, తల్లి ఉమా దేవి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. స్నేహితుల సహాయంతో తల్లిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి.. బుధవారం వేకువజామున శివకుమార్‌ నంద్యాలకు బయలు దేరారు. స్నేహితుడు కాశీ కారు డ్రైవింగ్‌ చేస్తున్నాడు.

నంద్యాల శివారులోని శాంతిరామ్‌ ఆసుపత్రి వద్ద కారు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో కారు లారీని ఢీకొట్టి  ఇరుక్కుపోయింది. దీన్ని గమనించని లారీ డ్రైవర్‌ కారును దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. కారులో మంటలు చెలరేగడంతో ముగ్గురు స్నేహితులు బయటకు దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. శివకుమార్‌ను రక్షించేందుకు వారు విఫలయత్నం చేశారు. శివకుమార్‌ నిస్సహాయ స్థితిలో కారులోనే సజీవ దహనమయ్యాడు. మరో వాహనదారుడు లారీని ఓవర్‌టేక్‌ చేసి చెప్పేవరకు డ్రైవర్‌ గమనించక పోవడం గమనార్హం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు