ఎవరెస్ట్‌ అధిరోహించేందుకు వెళ్లి పరలోకాలకు.. గుండెపోటుతో నల్లగొండ యువకుడు మృతి

25 Dec, 2022 13:54 IST|Sakshi

చిట్యాల: ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలనే చిన్ననాటి కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన అద్దెల ఉపేందర్, ఉమ దంపతులు 30ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని సాయినగర్‌కు వలస వెళ్లి స్థిరపడ్డారు. వీరికి ఓ కూతురుతో పాటు కుమారుడు రాజశేఖర్‌రెడ్డి(32) ఉన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ పూర్తిచేసి స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన యువతితో వివాహం జరిగింది.

2నెలలు శిక్షణ పొంది..
రాజశేఖర్‌రెడ్డి ఎవరెస్ట్‌ శిఖరం బేస్‌ క్యాంపు వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అసోంలో రెండు నెలల పాటు పర్వతారోహణపై శిక్షణ పొందాడు. ఈ నెల 3వ తేదీన మరికొంత మంది పర్యాతారోహకులతో కలిసి నేపాల్‌కు వెళ్లాడు. ఖాట్మండు నుంచి వాహనంలో సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని సల్లేరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి పది రోజుల పాటు ప్రయాణించి 4,910 మీటర్ల ఎత్తులో ఉండే లోబూచే పర్వతాన్ని ఈ నెల 21న చేరుకున్నాడు. అక్కడ సీప్ర లాడ్జిలో బసచేశాడు.

ఇక్కడి నుంచి మరో 600 మీటర్లు ట్రెక్కింగ్‌(పర్వతారోహణ) చేస్తే రాజశేఖర్‌రెడ్డి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు(5,500 మీటర్ల దూరం) చేరుకునేవాడు. అయితే, ఈ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వాతావరణం అనుకూలించక రాజశేఖర్‌రెడ్డి లాడ్జిలోనే ఉండిపోయాడు. దీంతో ఆయన అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది ఈ నెల 22న రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన విషయాన్ని గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు నేపాల్‌కు బయలుదేరి వెళ్లారు.

కాగా, మృతదేహాన్ని అక్కడి అధికారులు నేపాల్‌లోని ఖాట్మండు వరకు తీసుకువచ్చారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. సోమవారం వరకు రాజశేఖర్‌రెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోనుందని, సాయినగర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
చదవండి: యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

మరిన్ని వార్తలు