కొల్లు రవీంద్రకు నోటీసులు

5 Dec, 2020 03:48 IST|Sakshi
విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసు అందజేస్తున్న సీఐ శ్రీనివాస్‌

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 91 కింద జారీ  

విచారణకు హాజరవుతానన్న మాజీ మంత్రి 

ముగిసిన నిందితుడు నాగేశ్వరరావు పోలీస్‌ కస్టడీ.. మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలింపు 

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై జరిగిన హత్యాయత్నం కేసులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి  కొల్లు రవీంద్రకు మచిలీపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 91 కింద విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ కొల్లు నివాసానికి వెళ్లి ఇనగుదురుపేట సీఐ శ్రీనివాస్‌ నోటీసులు అందజేశారు. అయితే తన ఆరోగ్యం బాగాలేదని కుదుటపడగానే విచారణకు హాజరవుతానని మాజీ మంత్రి బదులిచ్చారు. కాగా, ఘటన జరిగిన వెంటనే కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఆయనపై అనుమానం కలిగేలా చేశాయి. ఇసుక కొరత వల్ల పనుల్లేకే నిందితుడు బడుగు నాగేశ్వరరావు మంత్రి నానిపై దాడి చేశాడని రవీంద్ర వ్యాఖ్యానించారు. నిందితుడు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలైన బడుగు ఉమాదేవికి స్వయానా సోదరుడైనప్పటికీ అతనికి తమ పార్టీతో ఎలాంటి సంబంధాల్లేవని ప్రకటించారు.

మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్యకేసులో మాదిరిగానే ఈ కేసులో కూడా తనను కావాలనే ఇరికించేస్తారని అన్నారు. ప్రాథమిక విచారణ కూడా పూర్తికాకుండానే మాజీ మంత్రి నుంచి ఈ తరహా స్టేట్‌మెంట్‌ రావడంతో ఈ కేసులో నిజంగానే ఆయన ప్రమేయం ఉందనే అనుమానాలు తలెత్తాయి. దీంతో ఈ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు గతంలో నోటీసులు జారీ చేయగా.. టీడీపీతో నిందితుడు బడుగు నాగేశ్వరరావుకు సంబంధం లేదని, ఇసుక కొరత వల్లే నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టుగా ఎస్పీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తానలా మాట్లాడానని లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కొల్లు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని విచారణాధికారైన బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి తాజాగా సీఆర్‌పీసీ కింద శుక్రవారం నోటీసులు జారీ చేశారు. విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రవీంద్రను పోలీసులు హెచ్చరించారు. పలువురు టీడీపీ సీనియర్లతో చర్చించిన మీదట.. విచారణకు హాజరవుతానని రవీంద్ర తెలిపారు. 

సబ్‌జైలుకు నిందితుడి తరలింపు
మరోపక్క రెండ్రోజుల పోలీస్‌ కస్టడీ ముగియడంతో నిందితుడు బడుగు నాగేశ్వరరావును శుక్రవారం సాయంత్రం వైద్య పరీక్షలనంతరం మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. మంత్రిని హతమార్చేందుకే తాను వెళ్లానని, ఇందుకు తనను ఎవరూ పురిగొల్పలేదని విచారణలో నిందితుడు  బదులిచ్చినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. కాగా టీడీపీ నేతలు మారగాని పరబ్రహ్మం, శ్రీను, నిందితుడి సోదరి ఉమాదేవి తదితరులను విచారించిన పోలీసులు కొంత మేర సమాచారాన్ని రాబట్టినట్టు తెలియవచ్చింది. 

మరిన్ని వార్తలు