పక్కింటికే కన్నం వేసిన జల్సారాయుడు!

10 Mar, 2021 08:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెద్దపల్లిరూరల్‌: జల్సాలకు అలవాటు పడి డబ్బును సులువుగా సంపాదించేందుకు దొంగతనాన్ని ఎంచుకున్న సందిరి రాజు పక్కింటికే కన్నం వేసి బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. డీసీపీ రవీందర్‌ కథనం ప్రకారం.. సిద్దిపేట ప్రాంతానికి చెందిన సందిరి రాజు కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ పనులు చేస్తూ కొంతకాలంగా పెద్దపల్లిలోని సాయినగర్‌లో నివాసముంటున్నాడు. అతడి ఇంటి పక్కనే పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సురేశ్‌ కుటుంబం ఉంటోంది. ఈ నెల 8న సురేశ్‌ కుటుంబం ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాజు సుత్తెతో తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 9 తులాల బంగారు, 16 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశాడు.     

సాయంత్రం ఇంటికి చేరుకున్న సురేశ్‌ దొంగలుపడ్డారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన పోలీసు అధికారులకు రాజు కదలికలపై అనుమానం వచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నాడని డీసీపీ వివరించారు. నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకొని దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చోరీ జరిగిన 12 గంటల్లోపే దొంగను పట్టుకుని సొత్తును స్వాధీనం పర్చుకున్న సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై రాజేశ్, సిబ్బంది దుబాసి రమేశ్, మాడిశెట్టి రమేశ్‌లను డీసీపీ, ఐపీఎస్‌ అధికారి నితికపంత్‌ అభినందించారు.  

చదవండి: మేనకోడలిని దారుణంగా చంపేశాడు!

మరిన్ని వార్తలు