పాఠశాలపై సాయుధుడి కాల్పులు.. 15 మంది మృతి

27 Sep, 2022 07:17 IST|Sakshi

మాస్కో: రష్యాలోని ఓ పాఠశాలలో పూర్వ విద్యార్థి సోమవారం దారుణానికి పాల్పడ్డాడు. రెండు పిస్టళ్లతో విచక్షణారహితంగా కాల్పులకు దిగి 11 మంది చిన్నారులు సహా 15 మందిని పొట్టన పెట్టుకున్నాడు. తర్వాత కాల్చుకుని చనిపోయాడు. ఈ కాల్పుల్లో మరో 22 మంది చిన్నారులు గాయపడ్డారు. ఉదుముర్షియా రీజియన్‌లోని ఉరాల్‌ పర్వతాల పశ్చిమాన ఉన్న ఇజెవిస్క్‌ సిటీలో ఈ దారుణం చోటుచేసుకుంది.

‘‘హంతకుని పేరు ఆర్టెమ్‌ కజన్‌స్తేవ్‌ (34). స్వస్తిక్, నాజీ గుర్తులున్న నల్లు టీ షర్ట్‌ వేసుకున్నాడు. అతని నేర చరిత్ర ఇంకా తెలియదు. ఎందుకు కాల్పులు జరిపాడు? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ఉదుముర్షియా గవర్నర్‌ అలెగ్జాండర్‌ బ్రెచలోవ్‌ చెప్పారు. ఈ స్కూళ్లో ఒకటి నుంచి 11వ తరగతి వరకు విద్య బోధిస్తారు. అర్టెమ్‌ గతంలో ఇక్కడి మానసిక చికిత్సాలయంలో పేరు రిజిస్టర్‌ చేసుకున్నాడని నిఘా దర్యాప్తులో తేలింది. కాల్పుల ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.   

ఇదీ చదవండి: హిజాబ్ నిరసనల్లో సోదరుడు మృతి.. అంత్యక్రియల్లో ఏడుస్తూ జుట్టుకత్తిరించుకున్న యువతి..

మరిన్ని వార్తలు