నారాయణ అరెస్టు

11 May, 2022 03:58 IST|Sakshi
వైద్య పరీక్షల కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి నారాయణను తీసుకువచ్చిన పోలీసులు

టెన్త్‌ ప్రశ్నపత్రాల లీకేజీ టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నారాయణ నిర్వాకమే

దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన నారాయణ ఉద్యోగులు

ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురిచేసి ప్రశ్నపత్రాల లీక్‌ 

నారాయణను మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచిన పోలీసులు

విద్యాసంస్థ ముసుగులో దశాబ్దాలుగా వ్యవస్థీకృత దందా

నారాయణ నేతృత్వంలో ప్రైవేట్‌ సిండికేట్‌ అక్రమాలు

సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాలుగా వ్యవస్థీకృతమై విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టింది. టెన్త్‌ ప్రశ్నపత్రాల లీకేజీ సూత్రధారి, టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం చిత్తూరుకు తరలించి ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అర్ధరాత్రి తర్వాత మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచగా, 2 గంటల సమయానికి నిర్ణయం ఇంకా వెలువరించలేదు. ఇదిలాఉండగా నారాయణ ఆదేశాలతోనే ప్రశ్నపత్రాలను లీక్‌ చేశామని ఈ కేసులో ఇటీవల అరెస్టయిన తిరుపతి నారాయణ స్కూల్స్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ గిరిధర్‌రెడ్డి, డీన్‌ బాల గంగాధర్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడించడం గమనార్హం. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులే ప్రశ్నాపత్రాల లీకేజీ తీరును సాక్ష్యాధారాలతో వెల్లడించడంతో మాజీ మంత్రి నారాయణను తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు అరెస్టు చేశారు.

నారాయణ విద్యా సంస్థలు కేంద్రంగానే రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో చిత్తూరు నుంచి వెళ్లిన పోలీసుల బృందం హైదరాబాద్‌లో నారాయణను అదుపులోకి తీసుకుంది. ఆయన భార్య రమాదేవికి 50 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చారు. నారాయణను రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి తరలించగా ఆమె కూడా అదే వాహనంలో చిత్తూరు వచ్చారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్టు చేసినట్లు ప్రకటించిన పోలీసులు పరీక్షల మాల్‌ప్రాక్టీస్‌ యాక్ట్‌ 408, 409, 201, 120 (బి) ఐపీసీ, 65 ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
 
లీక్‌ చేయాలని ఉద్యోగులకు నారాయణ ఆదేశం
తమ విద్యా సంస్థల విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేసేందుకు నారా>యణ ఎన్నో ఏళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు  దర్యాప్తులో వెల్లడైంది. తిరుపతి నారాయణ స్కూల్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌రెడ్డి, డీన్‌ బాలగంగాధర్‌ నేరాన్ని అంగీకరించారు. ప్రశ్నాపత్రాలను లీక్‌ చేయాలని నారాయణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు.

ఏటా పరీక్షలకు ముందు నారాయణ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రశ్నాపత్రం లీక్‌ చేసి తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేయాలని ఆదేశిస్తారని తెలిపారు. అందుకోసం విద్యా శాఖ కార్యాలయం నుంచి ఇన్విజిలేటర్లుగా నియమితులయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయుల జాబితాను తెప్పించుకుంటారు. కొందరిని లంచాలు, బహుమతులతో ప్రలోభాలకు గురి చేసి వారి ద్వారా ప్రశ్నాపత్రాలను లీక్‌ చేస్తారు.

పరీక్షా కేంద్రాల్లో ఉండే కొందరు కిందిస్థాయి సిబ్బంది ద్వారా వాటిని బయటకు తెప్పించిగానీ వాట్సాప్‌ ఫొటోల ద్వారాగానీ లీక్‌ చేస్తారు. ముందుగానే సబ్జెక్టులవారీగా సిద్ధం చేసుకున్న జవాబులు తమ విద్యార్థులకు అందజేస్తారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నట్లుగానే నారాయణ ఈ ఏడాది కూడా తమ ఉద్యోగుల ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్‌ చేయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రశ్నాపత్రం లీక్‌ కాగానే జవాబులు సిద్ధం చేసి వాట్సాప్‌లో పెట్టేలా ఓ బృందాన్ని నియమించారు.

ఇందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సహకారం కావాలని, ఎంత డబ్బు వెచ్చించైనా కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతోపాటు ఇన్విజిలేటర్లను ప్రభావితం చేసి మాల్‌ప్రాక్టీస్‌కు సహకరిస్తే రూ.వేలల్లో ముట్టజెప్పడం, ప్రత్యేక పార్టీలు, బహుమతులు ఇవ్వాలని తమ సిబ్బందిని నారాయణ ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇచ్చి జీతాలు కూడా పెంచుతామని ఎర చూపారు. ఈ విషయాలన్నీ తిరుపతి నారాయణ విద్యా సంస్థల వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌రెడ్డి, డీన్‌ బాల గంగాధర్‌ పూస గుచ్చినట్లుగా విచారణలో వెల్లడించారు.

సిండికేట్‌గా ఏర్పడి...
ప్రశ్నాపత్రం లీకేజి కోసం నారాయణ విద్యా సంస్థలు కేంద్ర బిందువుగా మరికొన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఏకంగా ఒక సిండికేట్‌గా ఏర్పడ్డాయి. నారాయణతోపాటు చైతన్య, శ్రీకృష్ణారెడ్డి చైతన్య, ఎన్‌ఆర్‌ఐ అకాడమీ తదితర విద్యా సంస్థలు ఆ సిండికేట్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. తమ విద్యార్థులకు అక్రమమార్గాల్లో ఎక్కువ మార్కులు వచ్చేలా చేయడం ద్వారా ప్రచారం చేసుకుని భారీగా అడ్మిషన్లు, ఫీజులు వసూలు చేస్తున్నాయి.

బండారం బట్టబయలు ఇలా...
విద్యా శాఖ, పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించడంతో నారాయణ విద్యా సంస్థల లీకేజీ బాగోతం బట్టబయలైంది. తిరుపతి ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని నారాయణ స్కూల్‌ బ్రాంచ్‌ డీన్‌ బాల గంగాధర్‌(బాలు) తమ స్కూల్‌ తెలుగు లెక్చరర్‌ గిరిధర్‌ సహాయంతో పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని లీక్‌ చేయించి నారాయణ విద్యా సంస్థలకు చెందిన గ్రూపులలో పెట్టారు. వాటికి సమాధానాలు తయారు చేసి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల సహాయంతో వారి విద్యార్థులకు అందించారు.

అందుకోసం చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలంలోని నెల్లేపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌రెడ్డికి రూ.10 వేలు, రూ.15 వేలు చొప్పున ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి తమకు అనుకూలంగా మలచుకున్నారు. గత నెల 27న తెలుగు పరీక్ష ప్రారంభం కాగానే పవన్‌కుమార్‌రెడ్డి ( ఆయనకు పరీక్ష విధులు కేటాయించనప్పటికీ) నెల్లేపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల రూమ్‌ నంబర్‌ 1కు వెళ్లి పశ్నాపత్రాన్ని ఫొటో తీశాడు. సిండికేట్‌ వ్యూహంలో భాగంగా ప్రశ్నాపత్రం ఫొటోను శ్రీకృష్ణారెడ్డి చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సురేష్‌కు వాట్సాప్‌ చేశాడు.

ఆయన ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఉపాధ్యాయుడు కె.సుధాకర్‌కు వాట్సాప్‌ను ఫార్వర్డ్‌ చేశారు. ఆయన నుంచి చైతన్య స్కూల్‌ డీన్‌ కె.మోహన్, నారాయణ స్కూల్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌.గిరిధర్‌రెడ్డికి ఒకేసారి వాట్సాప్‌ చేశారు. తిరిగి మోహన్‌ ఆ ప్రశ్నాపత్రాన్ని చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆరీఫ్‌కు వాట్సాప్‌ ద్వారా పంపించారు. అలా రాష్ట్రవ్యాప్తంగా చాలామందికి పంపించారు. 

డివైజ్‌లు, సెల్‌ఫోన్లు సీజ్‌
ఆ ప్రశ్నాపత్రం చిత్తూరు టాకీస్‌ అనే వాట్సాప్‌ గ్రూపులోకి రావడంతో విద్యా శాఖ, పోలీసు అధికారులు దృష్టిసారించారు. చిత్తూరు డీఈవో ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోములతోపాటు పి.సురేష్‌ (ప్రిన్సిపాల్‌ , శ్రీకృష్ణారెడ్డి చైతన్య స్కూల్, చంద్రగిరి), కె. సుధాకర్‌(ఎన్‌ఆర్‌ఐ అకాడమి, తిరుపతి), ఆరీఫ్‌ (ప్రిన్సిపాల్, చైతన్య స్కూల్, తిరుపతి), ఎన్‌.గిరిధర్రెడ్డి (వైస్‌ ప్రిన్సిపాల్, నారాయణ స్కూల్, తిరుపతి), కె.మోహన్, డీన్, చైతన్య స్కూల్, తిరుపతి)లను చిత్తూరు పోలీసులు గత నెల 29న అరెస్టు చేశారు.

గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్‌బాబు, పవన్‌కుమార్‌లను ఈ నెల 9న పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణే ప్రధాన సూత్రధారని వెల్లడించారు. ఈ కేసులో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు, సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్‌ చేశారు. వారి మధ్యసాగిన వాట్సాప్‌ సందేశాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు.

పదేళ్ల జైలు శిక్ష!
తమ బండారం బయటపడిందని తెలియడంతో నారాయణ కొద్ది రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌లో వాకబు చేసినా జాడ లేరు. ఆయన సెల్‌ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్‌ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఆయన ఆచూకీ పోలీసులకు సోమవారం రాత్రి తెలిసింది. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్‌ వెళ్లిన పోలీసు బృందాలు నారాయణను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాయి.  ఈ కేసులో నేరం రుజువైతే నారాయణతో పాటు నిందితులకు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

నారాయణ చెబితేనే లీక్‌ చేశా..
ప్రశ్నాపత్రం లీకేజీపై గిరిధర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇదీ...‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నారాయణ స్కూల్స్‌లో పదో తరగతి విద్యార్థులు ఎక్కువగా జేఈఈ, నీట్‌లో ఎక్కువ మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం లాంగ్వేజ్‌ సబ్జెక్టులు, సోషల్‌ స్టడీస్‌ మినహా మిగిలిన సబ్జెక్టులకే ప్రాధాన్యమిస్తూ తరగతులు నిర్వహిస్తారు. దీంతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంటి లాంగ్వేజ్‌ సబ్జెక్టులు, సోషల్‌ స్టడీస్‌లో తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేయడానికి నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ పదో తరగతి పరీక్షలకు ముందు తమ సెంట్రల్‌ ఆఫీసు ఇన్‌చార్జ్‌లు, స్కూల్‌ హెడ్‌లు, ప్రిన్సిపాళ్లతో విజయవాడలోగానీ హైదరాబాద్‌లోగానీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారాగానీ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇన్విజిలేటర్లుగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులకు రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ ఇచ్చి లోబరుచుకోవాలని చెబుతారు. 

వాటర్‌ ప్యాకెట్లు అందించే సాకుతో..
ఈ ఏడాది ప్రశ్నాపత్రం లీక్‌ చేయమని నారాయణ ఆదేశించడంతో స్కూల్‌ డీన్‌ బాల గంగాధర్‌  సూచనలతో చిత్తూరు జిల్లా పరీక్షల డ్యూటీలో ఉన్న టీచర్ల వివరాలు ముందుగా తెప్పించుకుని వారితో మాట్లాడా. గతంలో మా స్కూల్‌లో పనిచేసి ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ అకాడమీలో ఉన్న సుధాకర్‌ ద్వారా తెలుగు ప్రశ్నాపత్రాన్ని తెప్పించా.

వాటికి సమాధానాలు తయారు చేసి వివిధ పరీక్షా కేంద్రాల సిబ్బందికి పంపి వాటర్‌ ప్యాకెట్లు ఇచ్చే సాకుతో మా విద్యార్థులకు అందించాం.  తరువాత నేను అదే ప్రశ్నా పత్రాన్ని నా సెల్‌ఫోన్‌ వాట్సాప్‌ నంబర్‌ 9177133613 ద్వారా నారాయణ విద్యాసంస్థల గ్రూపులో పోస్ట్‌ చేశా. తరువాత ప్రభుత్వానికి అపకీర్తి తేవాలన్న చెడు ఉద్దేశంతో ఆ ప్రశ్నాపత్రాన్ని చిత్తూరు ప్రెస్‌ రిపోర్టర్ల వాట్సాప్‌ గ్రూపు ‘‘చిత్తూరు టాకీస్‌’’లో కూడా పోస్ట్‌ చేశా. 
    

ప్రశ్నాపత్రం లీకేజీ సాగింది ఇలా... 
గత నెల 27న తెలుగు ప్రశ్నాపత్రం లీకేజి వాట్సాప్‌ల ద్వారా ఇలా సాగింది...
ఉదయం 09.30: చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులోని నెల్లెపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పవన్‌ కుమార్‌ రెడ్డి వాట్సాప్‌ చేశారు.
ఉదయం 09.37  : తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణా రెడ్డి చైతన్య స్కూల్‌ ప్రిన్సిపల్‌ పి. సురేష్‌ వాట్సాప్‌ చేశారు.
ఉదయం 09.39 : తిరుపతిలోని ఎన్‌ఆర్‌ఐ అకాడమీకి చెందిన కె.సుధాకర్‌ ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్‌ చేశారు. 
ఉదయం 09.40 : తిరుపతిలోని చైతన్య స్కూల్‌ డీన్‌ కె.మోహన్, తిరుపతి నారాయణ స్కూల్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌. గిరిధర్‌ రెడ్డి వాట్సాప్‌ చేశారు. 
ఉదయం 09.41 : తిరుపతిలోని చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరీఫ్‌ వాట్సాప్‌ చేశారు. 

నాందేడ్‌ పరారీకి యత్నం విఫలం 
సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పి.నారాయణ అరెస్టు నేపథ్యంలో హైడ్రామాకు తెర తీశారు. కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న నారాయణ కోసం చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌ చేరుకుని గాలిస్తున్నారు. కొండాపూర్‌లోని నివాసంలో నారాయణ అందుబాటులో లేకపోవడంతో నిఘా ఉంచారు. మంగళవారం ఉదయం ఆయన తన భార్యతో కలిసి నారాయణ మహారాష్ట్రలోని నాందేడ్‌ పారిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు.

ఐకియా చౌరస్తా వద్ద ఆయన వాహనాన్ని ఆపి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ భార్య హైదరాబాద్‌లోని మాదాపూర్, రాయదుర్గం పోలీసులకు ఫోన్‌ చేసి తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ డ్రామాకు తెర తీశారు. అనంతరం తనను తరలిస్తున్న పోలీసుల వాహనం కొత్తూరు వద్దకు చేరుకోగానే నారాయణ మరో ఎత్తుగడ వేశారు. అక్కడ స్థానిక పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండటంతో తనను కిడ్నాప్‌ చేశారంటూ కేకలు వేశారు. ఏపీ పోలీసులు అసలు విషయాన్ని వివరించడంతో వారు అడ్డుకోలేదు.

బెయిల్ మంజూరు..
మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు అయ్యింది. వ్యక్తిగత పూచీకత్తుతో మెజిస్ట్రేట్ సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ. లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని మెజిస్ట్రేట్ పేర్కొంది.

మరిన్ని వార్తలు