తీరు మారని చైనా

29 Jan, 2021 00:23 IST|Sakshi

నిరుడు ఏప్రిల్‌లో గాల్వాన్‌ లోయలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను అతిక్రమించి మన భూభాగంలోకి ప్రవేశించినప్పటినుంచీ చైనా ఎడతెగకుండా లడాయి కొనసాగిస్తోంది.  3,440 కిలోమీటర్ల ఎల్‌ఓసీ పొడవునా వేర్వేరుచోట్ల వేర్వేరు సందర్భాల్లో ఒక పథకం ప్రకారం తన దళాలతో అతిక్రమ ణలు చేయించటానికి ప్రయత్నించి ఉద్రిక్తతలను పెంచుతోంది. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో నిరుడు జూన్‌లో అకారణంగా మన జవాన్లపై రాళ్లు కర్రలతో దాడిచేసి 20మంది సైనికుల ఉసురుతీసింది. 45 సంవత్సరాల్లో ఎల్‌ఓసీలో నెత్తురొలకటం అదే ప్రథమం. ఆ తర్వాత అంత క్రితంవరకూ మన సైనికుల నియంత్రణలో వున్న డెస్పాంగ్, హాట్‌ స్ప్రింగ్స్‌ తదితరచోట్ల ఆక్రమ ణలకు దిగి అక్కడ మన జవాన్లు గస్తీ తిరగటానికి వీల్లేదంటూ పేచీ పెట్టింది. సైనిక కమాండర్ల స్థాయిలో ఇప్పటికి తొమ్మిదిసార్లు రెండు పక్షాలమధ్యా చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి లేదు.

బలగాల మోహరింపు, ఉద్రిక్తతలు పెరగటం వంటివి ఆగలేదు. ఈలోగా కొత్త కొత్త ప్రాంతాల్లో చైనా గాల్వాన్‌లోయ తరహా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సిక్కింలో గతవారం ఇదే పునరావృతమైంది. అక్కడ కూడా చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే మన జవాన్లు అడ్డగించారు. మొత్తమ్మీద మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి, మన జవాన్లను రెచ్చగొట్టి దాడి చేయటమో, మానటమో నిర్ణయించుకోక తప్పని స్థితిలోకి మనల్ని నెడుతోంది. ఎల్‌ఓసీలో యధా తథ స్థితిని నెలకొల్పాలంటే అక్కడ సైనిక దళాలను మోహరించటం, మన భూభాగాన్ని వెనక్కి తీసుకొనే ప్రయత్నం చేయటం తప్ప మనకు మార్గాంతరంలేని స్థితిని సృష్టించింది. ఇదంతా పద్ధతి ప్రకారం చేస్తోంది. అందుకే గత తొమ్మిది దఫాలుగా చర్చలు విఫలమవుతూ వస్తున్నాయి. చొర బాటు ప్రాంతం నుంచి వెనక్కెళ్లి, యధాతథ స్థితి పునరుద్ధరణకు సహకరించమని మన దేశం కోరటం... కాదు, ఆ ప్రాంతంలో మోహరించిన దళాలను మీరే వెనక్కి తీసుకోమని చైనా చెప్పటం రివాజుగా మారింది. సిక్కింలో తాజాగా జరిగిన తంతు ఆ పరంపరలో భాగమే. సాధారణంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరినప్పుడు రెండు పక్కలా సైన్యాలు మోహరించి తలపడతాయి. ఎదుటివారి భూభాగంలోకి ప్రవేశించి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాయి.

కానీ ఎల్‌ఓసీ పొడవునా పరిమిత ప్రాంతాల్లో అక్కడక్కడ తమ సైన్యంతో చడీచప్పుడూ లేకుండా చొరబాట్లు చేయించి, అక్కడినుంచి కదలకపోవటమనే కొత్త ఎత్తుగడకు చైనా తెరతీసిందని గత ఏడాది అనుభవం చెబుతోంది. అలా ప్రవేశించినచోట శిబిరాలు నిర్మించటం, అక్కడ సైనికుల్ని వుంచటం రివాజైంది. తాను సన్నిహితం చేసుకోవాలనుకుంటున్న నేపాల్‌ విషయంలోనూ చైనాది ఇదే ఎత్తుగడ. నిరుడు తమ భూభాగంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్న చైనాను ఏం చేయలేక అది నిస్సహాయంగా వుండి పోయింది. మన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో ఒక చిన్న గ్రామాన్నే అది సృష్టించింది. అక్కడ 120 ఆవాసాలతో రెండువేలమంది జనాన్ని పోగేసింది. ఈ క్రమంలో అది ఏ మర్యాదలూ పాటించటం లేదు. అరుణాచల్‌లోని చుశాల్‌ గ్రామానికి సమీపం లోనే మన భూభాగంలో చైనా సైనికులు శిబిరాలు వేసుకుని, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారని తూర్పు లద్దాఖ్‌  కౌన్సిలర్‌ ఒకరు ఇటీవలే చెప్పారు.

దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో అమెరికా సైనిక విమానమో, మరొకటో గగనతలంలో కనిపిస్తే రెచ్చిపోయి ప్రకటనలు చేసే చైనా భారత్‌ విషయంలో మాత్రం చడీచప్పుడూ లేకుండా వుండిపోతుంది. ఎల్‌ఏసీలో చైనా ఏదో ఒక చేష్టకు పాల్పడినప్పుడల్లా మనవైపు నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆక్రమణదారులకు సరైన గుణపాఠం చెబుతామన్న హెచ్చరికలుంటున్నాయి. కానీ అందులో చైనా ప్రస్తావన వుండదు. చైనా కూడా ఆ హెచ్చరికలు తమనుద్దేశించినవే అన్న అభిప్రాయం ప్రపంచానికి కలగనీయదు. తనను కానట్టు వుండిపోతుంది.

దాని చెప్పుచేతల్లో పనిచేసే ‘గ్లోబల్‌ టైమ్స్‌’ అనే పత్రిక మాత్రం తననే హెచ్చరించినంతగా బాధపడుతూ భారత్‌కు జవాబిస్తుంటుంది. 1962నాటి భంగపాటు గుర్తులేదా అంటూ ఎత్తిపొడుస్తుంది. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలొస్తుంటాయి. వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలూ జరుగుతుంటాయి. అయితే రెండు పక్షాల్లోనూ చిత్తశుద్ధి వున్నప్పుడే ఎంతో కొంత ఫలితం వుంటుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో అయిదారు నెలలక్రితం ఎలాంటి పరిస్థితి వుందో, ప్రస్తుతం ఎలావుందో చెప్పే ఉపగ్రహ ఛాయాచిత్రాలు సాక్ష్యాధారాలుగా చూపిస్తున్నా చైనా మాత్రం తన మంకుపట్టు మానటం లేదు సరిగదా... కొత్త కొత్త ప్రాంతాల్లో అదే మాదిరి ఎత్తుగడలకు పాల్పడుతోంది.  శాంతి కేవలం ఒక పక్షం మాత్రమే కోరుకుంటే ఏర్పడేది కాదు.

వివాదంలో భాగస్వాములైన రెండు పక్షాలూ అందుకు సిద్ధపడాలి. చైనా పోకడలు చూస్తుంటే అందుకు సిద్ధపడుతున్న దాఖలా లేదు. వచ్చే జూలైలో చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుగు తున్నాయి. అందుకోసం భారీయెత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం కూడా అందులో తలమునకలై వున్నాయి. తన హయాంలో కమ్యూనిస్టు పార్టీ, చైనా కూడా సమర్థవంతంగా వున్నాయన్న అభిప్రాయం శ్రేణుల్లో కలగజేయటం అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అవసరం కాబట్టే ఆయన దూకుడుగా వున్నట్టు కనబడుతున్నారని ఆసియాలో ఆధిపత్యాన్ని స్థిరపరుచు కుంటున్నామన్న భావన కలగజేయటానికి ప్రయత్నిస్తున్నారని కొందరు నిపుణుల అంచనా. ఆ తర్వాత చైనా వైఖరి సడలే అవకాశం వున్నదని వారి విశ్లేషణ. వాటి సంగతలా వుంచితే చైనా పోకడలను ప్రపంచానికి తెలియజెప్పటానికి, ఇలాంటి ఘర్షణాత్మక పోకడల వల్ల సమస్యలేర్పడతాయని నేరుగా చెప్పటానికి అంతర్జాతీయ వేదికల ద్వారా మన దేశం ప్రయత్నించాలి.

>
మరిన్ని వార్తలు