Health Benefits Of Corn: మొక్కజొన్న పొత్తు తరచుగా తింటున్నారా? ఇందులోని లైకోపీన్‌..

3 Aug, 2022 18:35 IST|Sakshi

వర్షాకాలంలో వేడి వేడి నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న(కార్న్‌) పొత్తు తింటే ఆ మజానే వేరు కదా! తీపి రుచులను ఆస్వాదించే వారైతే స్వీట్‌కార్న్‌ తింటే సరి! కొంతమందికేమో మొక్కజొన్న గింజలు వేయించుకునో.. ఉడకబెట్టుకొనో తినడం ఇష్టం! మరి.. అందరికీ అందుబాటు ధరలో ఉండే మొక్కజొన్నను కేవలం టైమ్‌పాస్‌ ఫుడ్‌ అని తేలికగా కొట్టిపారేయకండి! దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందామా?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక కప్పు పచ్చి మొక్కజొన్న గింజల్లో 125 కాలరీలు ఉంటాయి. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు.. 4 గ్రాముల ప్రొటిన్లు, 9 గ్రాముల షుగర్‌, 2 గ్రాముల ఫ్యాట్‌, 75 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటుంది.

రక్తహీనతకు చెక్‌!
మొక్కజొన్నలో విటమిన్‌ బీ12 పుష్కలం. అంతేకాదు ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ కూడా అధికం. ఇవన్నీ శరీరంలో ఎర్రరక్త కణాల ఉ‍త్పత్తిని పెంచడంలో తోడ్పడతాయి. తద్వారా రక్త హీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతులకు మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఇది దోహదపడుతుంది.  

బరువు పెరగాలనుకుంటున్న వారు...
ఉండాల్సిన దాని కన్నా తక్కువ బరువు ఉండి బాధపడుతున్న వారు మొక్కజొన్న తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. తగిన పరిమాణంలో కొంతకాలం పాటు వీటిని తింటే నీరసం తగ్గడంతో పాటు ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు.

ఇక మొక్కజొన్నలో పీచు పదార్థం (ఫైబర్‌) పుష్కలం. ఆహారం జీర్ణమవడంలో ఉపకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్‌ కూడా ఎక్కువే.

కంటి ఆరోగ్యానికై..
మొక్కజొన్నలో బీటా–కెరోటిన్‌ ఎక్కువ. వంద గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్‌–ఏ లోని ఆరు శాతం మనకు సమకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్‌–ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

అవి కూడా!
విటమిన్‌-ఏతో పాటు మొక్కజొన్నలో విటమిన్‌ బీ, సీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్‌ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్ వంటి జీవక్రియలు సక్రమంగా సాగడంలో తోడ్పడతాయి.  ఇక స్వీట్‌ కార్న్‌... రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

మొక్కజొన్నలో ఫెలురిక్‌ యాసిడ్‌ అనే శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్‌ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాదు... అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను కూడా అరికడుతుంది.

ఇక గాయమైనపుడు కలిగే ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట, నొప్పి)ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. ఏదేమైనా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మొక్కజొన్న అయినా... మరే ఇతర ఆహార పదార్థాలైనా.. మితంగా తింటేనే మేలు! ఇందులో పిండి పదార్థాలు కాస్త ఎక్కువే కాబట్టి మధుమేహులు దీనికి కాస్త దూరంగా ఉంటేనే బెటర్‌!

ఆరోగ్యకరమైన చర్మం కోసం..
మొక్కజొన్నలో విటమిన్‌ సీతో పాటు లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ అధికం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే కార్న్‌ ఆయిల్‌, కార్న్‌ స్టార్చ్‌ను పలు సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడతారు. 

పొటాటో – కార్న్‌ సూప్‌ ఇలా తయారు చేసుకోండి!
కావలసినవి
►బంగాళ దుంపలు – 6 (తొక్క తీసి ముక్కలు చేయాలి)
►కొత్తిమీర ఆకులు – ఒక కప్పు
►ఉల్లి తరుగు – పావు కప్పు
►మొక్క జొన్న గింజలు – రెండు కప్పులు
►ఉల్లి కాడల తరుగు – పావు కప్పు
►ఉప్పు – తగినంత

తయారీ
►ఒకపెద్ద పాత్రలో బంగాళ దుంప ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు, తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టి ఉడికించాలి.
►మొక్కజొన్న గింజలు జత చేసి పదార్థాలన్నీ మెత్తగా అయ్యేవరకు సుమారు పది నిమిషాలు ఉడికించాలి.
►ఉల్లికాడలు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేసి, వడగట్టి అందించాలి.
చదవండి: Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే..

మరిన్ని వార్తలు