రెండు రొట్టెలు.. రూ. 70 వేలు

15 Sep, 2020 06:56 IST|Sakshi

స్త్రీలకు ఏమీ రాకపోవడం అంటూ ఎప్పటికీ ఉండదు. వారికి వచ్చింది కూడా ఎంతో విలువైనదే. హర్యాణాలోని నౌరంగాబాద్‌ అనే చిన్న పల్లెలో ఉండే బబితా ఒకరోజు రెండు రొట్టెలు చేసింది. ఆమె చేస్తున్న పనిలో పొందిక చూసిన మరిది వీడియోలో షూట్‌ చేసి యూ ట్యూబ్‌లో పెట్టారు. ఇక ఆమె వంట గదికి లక్షల మంది అభిమానులయ్యారు.తన కట్టెల పొయ్యి మీద వారానికి ఒకటి రెండు వంటలు చేసి వీడియోలు  పెడుతున్న బబితకు యూట్యూబ్‌ నెలకు 70 వేల రూపాయలు ఇస్తోంది!

ఆ ఇంట్లో ఇనప్పెట్టె వంట గదిలో ఉందని వారికి 2017 వరకూ తెలియలేదు. ఆ ఇంటికి కోడలుగా వచ్చిన బబితా పర్మార్‌ చేతుల్లోనే ఆ ఇనప్పెట్టె తాళం ఉంటుందని కూడా వారికి తెలియదు. ఇదంతా ఒక విస్మయంతో మొదలైంది. హర్యాణాలోని నౌరంగాబాద్‌ అనే చిన్న గ్రామంలో బబితా ఇంటికి కోడలుగా వచ్చింది. ఆమె వంట బాగా చేస్తుంది. తినడానికే కాదు చూడటానికి కూడా బాగుంటుంది. మరది రంజిత్‌కి ఇది తెలుసు. వదిన చేసే వంట వీడియోలను యూట్యూబ్‌లో పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాడు. యూ ట్యూబ్‌ వీడియో చానల్‌ ఎవరైనా ఎప్పుడైనా మొదలెట్ట వచ్చని తెలిశాక అతడు ఆగలేదు.

మొదటి వీడియో ఫ్లాప్‌
రంజిత్‌ దగ్గర కేవలం పది వేల రూపాయల మామూలు ఫోన్‌ ఉంది. మొదటగా వదినను ఒప్పించి ‘పిండి బాగా కలపడం ఎలా’ అనే వీడియో చేశాడు. ‘ఇండియన్‌ గర్ల్‌ బబితాస్‌ విలేజ్‌’ పేరుతో వీడియో చానల్‌ ఓపెన్‌ చేసి మొదటిసారి దానిని అప్‌లోడ్‌ చేశాడు. అలా 2017లో వారి చానల్‌ మొదలయ్యింది. అయితే మొదటి వీడియోను ఎవరూ పెద్దగా చూడలేదు. మరిది ఈసారి ఒక ఎడిటింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ‘మృదువైన రొట్టెలు తయారు చేయడం ఎలా’ అని వదిన తో వీడియో చేశాడు. ఆశ్చర్యం. రెండు రోజుల్లోనే దానికి పది లక్షల వ్యూస్‌ వచ్చాయి. వదిన, మరిది ఇద్దరూ స్టన్‌ అయ్యారు. ఇక వాళ్ల ప్రయాణం మొదలైంది.


ఇల్లే సెట్‌
బబిత ఇల్లు టిపికల్‌ భారతీయ పల్లెటూరి ఇల్లు. కట్టెల పొయ్యి, కిరోసిన్‌ స్టవ్, అలికిన పరిసరాలు... ఇలాంటివన్నీ వీడియోలో వచ్చేలా మరిది వంట వీడియోలు షూట్‌ చేస్తారు. ఎక్కువమందికి అవి నచ్చుతున్నాయి. తల మీద ఘూంఘట్‌ను అలాగే ఉంచుతూ చకచకా వంట చేసే బబితా చేతి నైపుణ్యాన్ని కూడా ఎక్కువమంది చూడటానికి ఇష్టపడుతున్నారు. నెలకు నాలుగైదు వంటలు చేసి వదిన–మరిది అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించారు. ‘మూలీ కె పరోఠే’, ‘పంజాబీ కడై పకోడా’, ‘గార్లిక్‌ ఆనియన్‌ చీజ్‌ పరోఠా’, ‘ఆలూ భుజియా’, ‘గమ్‌ లడ్డూ’లాంటి దేశీ వంటకాలు చూసి చేసుకునే అభిమానులు మెల్లగా పెరిగారు.

మొదటి పారితోషికం 13,400
యూట్యూబ్‌ చానెల్‌ మొదలైన ఆరునెలల తర్వాత యూట్యూబ్‌ ఆ చానెల్‌ను మానిటైజ్‌ చేయడం మొదలెట్టింది. బబిత అకౌంట్‌లో డబ్బు పడటం మొదలయ్యింది. అయితే అవన్నీ ఉత్తుత్తి డబ్బు అని నిజం డబ్బు కాదని స్నేహితులు చెప్పారు. కాని ఒకసారి నిజం డబ్బు పడింది. తొలి పారితోషికం 13,400 రూపాయలు. అవి పడిన రోజు ఆ ఊరంతా ఒక వింతగా చెప్పుకున్నారు. కుటుంబం ఆనందానికి అంతే లేదు. ఆ తర్వాత నెలకు కచ్చితంగా నాలుగైదు కొత్త వీడియోలు అప్‌లోడ్‌ అయ్యేలా చూసుకున్నారు.

యూ ట్యూబ్‌ నుంచి రెగ్యులర్‌గా డబ్బుపడటం మొదలైంది. కొన్నిసార్లు ఇరవై వేల లోపు పడేది. ఒక్కోసారి రెండు లక్షలు పడేవి. యావరేజ్‌గా చూసుకుంటే ఇప్పటికి వారికి నెలకు అరవై డెబ్బయి వేలు వచ్చినట్టు లెక్క. ఈ డబ్బుతో రంజిత్‌ మంచి ఫోన్లు, కెమెరా స్టాండ్లు, లాప్‌టాప్‌ కొన్నాడు. మిగిలిన డబ్బు ఎలాగూ కుటుంబానిదే. ఇప్పటికి ఈ వదినా మరిది కలిసి 124 వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. దాదాపు నాలుగున్నర లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఈ చానల్‌కు ఉన్నారు. హర్యాణాలోని మారుమూల పల్లెటూళ్లో ఒక వంట గది నుంచి కూచుని ఇంత ఉపాధి పొందవచ్చు అని వీరు నిరూపించారు.
ప్రయత్నించాలేగాని ఇలాంటి ఉపాధి మార్గాలు వేనవేలు.
– సాక్షి ఫ్యామిలీ 

మరిన్ని వార్తలు