బీట్‌రూట్‌తో పకోడీ ట్రై చేశారా?

14 Mar, 2021 09:14 IST|Sakshi

స్నాక్‌ సెంటర్‌

బ్రెడ్‌ రోల్స్‌
కావలసినవి: బ్రెడ్‌ స్లైస్‌ – 10(అంచులు తొలగించి పెట్టుకోవాలి), క్యారెట్‌ తురుము – 1 కప్పు, పనీర్‌ తురుము – పావు కప్పు, ఉల్లిపాయ – 1(సన్నగా తరగాలి), పచ్చి మిర్చి – 2(చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), మిరియాల పొడి – పావు టీ స్పూన్, వెన్న – 1 టీ స్పూన్‌, కారం – అర టీ స్పూన్, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. కళాయిలో వెన్న వేసుకుని, కరిగిన వెంటనే అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం పనీర్‌ తురుమును కూడా వేసి వేయించుకోవాలి.  ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలుపుకుని, ఒక నిమిషం పాటు వేగాక స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌లో వేసుకుని రోల్‌లా చుట్టుకోవాలి. రోల్‌ విడిపోకుండా ఉండేందుకు బ్రెడ్‌ అంచుల్ని కాస్త తడిచేసి లోపలికి నొక్కేయాలి. అన్ని బ్రెడ్‌ ముక్కల్ని ఇలాగే చేసి పెట్టుకుని.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

బీట్‌రూట్‌ పకోడా


కావలసినవి:బీట్‌రూట్‌ తురుము – అర కప్పు, పచ్చి శనగపప్పు – అర కప్పు(నానబెట్టుకోవాలి), జీలకర్ర – పావు టీ స్పూన్, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్, బియ్యప్పిండి – 1 టేబుల్‌ స్పూన్‌, మొక్కజొన్న పిండి – 1 టేబుల్‌ స్పూన్‌, కారం – 1 టీ స్పూన్‌, ఉల్లిపాయలు – 2(చిన్నగా కట్‌ చేసుకోవాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బీట్‌ రూట్‌ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి శనగపప్పు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని, నూనె బాగా కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని.. పకోడాలు వేసుకోవాలి.

వెజిటబుల్‌ పనియారం


కావలసినవి:దోసెల పిండి – 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్‌ స్పూన్లు, క్యారెట్‌ గుజ్జు, బీట్‌రూట్‌ గుజ్జు – పావు కప్పు చొప్పున, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్, అల్లం– వెల్లుల్లి పేస్ట్‌ – పావు టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. దోసెల పిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ గుజ్జు, బీట్‌రూట్‌ గుజ్జు, పసుపు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం– వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని.. పొంగనాల పాన్‌లో అడుగున నూనె రాసుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం పెట్టుకుని, కుక్కర్‌లో లేదా ఓవెన్‌లో ఉడికించుకుంటే వెజిటబుల్‌ పనియారం సిద్ధం. 

మరిన్ని వార్తలు