గీరిన ముద్రలు మీ చర్మంపై ఉన్నాయా... అయితే ఇలా చేయండి!

26 Dec, 2021 13:48 IST|Sakshi

మనిషి తన కళా ప్రదర్శనకు చివరికి సొంత చర్మాన్ని కూడా వదలలేదు. గోరింటాకు (మెహందీల)తో తాత్కాలికంగా, పచ్చబొట్ల(టాటూల)తో శాశ్వతంగా దాన్ని అలంకరించడం మానలేదు. మెహందీ లేదా టాటూ అయితే అది ప్రయత్నపూర్వయంగా చేసే పని. కానీ కొందరు ఎదుర్కొనే ఓ వింత సమస్య చర్మంపై  చాలా చిత్రమైన ప్రభావం చూపుతుంది. ఏమాత్రం గీరినా లేదా చేయి బలంగా తగిలినా దేహంపైన ఉండే చర్మం పైకి ఉబికి ఎంబోజింగ్‌ చేసినట్లుగా మారుతుంది. ఇలాంటి వారి చర్మంపై ఏదైనా రాసినప్పుడు అది పైకి ఉబికి కనిపిస్తుండటం వల్ల ఈ సమస్యను ‘స్కిన్‌ రైటింగ్‌’ అని అంటారు. వైద్యపరిభాషలో దీన్ని ‘డర్మటోగ్రాఫియా’గా పిలుస్తారు. 
కారణాలు: 
మనకు ఏదైనా సరిపడనిది దేహంలోకి గానీ, లేదా చర్మంపైన చేరితే... మన వ్యాధినిరధకత (ఇమ్యూన్‌ సిస్టమ్‌ / సిగ్నల్స్‌) దాన్ని ఎదుర్కొనేందుకు హిస్టమైన్స్‌ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. (అందుకే మనకు ఏదైనా సరిపడక రియాక్షన్‌ వచ్చినప్పుడు దాన్ని తగ్గించేందుకు యాంటీహిస్టమైన్‌ మందులు వాడటం మనకు తెలిసిన విషయమే). 
ఒక్కోసారి మనపై ఉన్న తీవ్రమైన మానసిక/శారీరక ఒత్తిళ్ల (స్ట్రెస్‌/యాంగై్జటీల) వల్ల కూడా ‘డర్మటోగ్రాఫియా’ కనిపిస్తుంది. ∙కొన్ని సందర్భాల్లో సరిపడని మందుల వల్ల కూడా ఇది కనిపించవచ్చు. ఎక్కువసేపు మైక్రోఒవెన్‌ దగ్గర ఉండే కొంతమందిలో ఈ సమస్యను పరిశోధకులు గుర్తించారు. 

ముప్పు ఎవరిలో ఎక్కువ...
యౌవనంలో ఉన్నవారిలో ∙పొడిచర్మం ఉన్నవారిలో ∙డర్మటైటిస్‌ లేదా థైరాయిడ్‌  వంటి మెడికల్‌ హిస్టరీ ఉన్నవారిలో 
నివారణ
దురద పుట్టించే బిగుతు దుస్తులు లేదా బెడ్‌షీట్స్‌ వాడకూడదు. అలాగే అలర్జీలకు కారణమయ్యే కంబళ్లు, ఊల్‌తో/ సింథటిక్‌ పద్థలుల్లో తయారయ్యే దుస్తులు,  చర్మానికి అలర్జీ కలిగించేవి వాడకూడదు. అలర్జీ కలిగించే ఘాటైన వాసన సబ్బులు (సోప్స్‌ విత్‌ ఫ్రాగ్నెన్స్‌) వాడకూడదు.

గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. (ఒక్కోసారి బాగా వేడిగా ఉండే నీళ్లు కూడా డర్మటోగ్రాఫియాను కలిగించవచ్చు.)
చర్మంపై రోజూ మాయిష్చరైజింగ్‌ క్రీమ్‌ వాడుకోవడం మంచిది.
ఇలాంటి సమస్య ఉన్నవారి చర్మంపై గీరడం, గీయడం చేయకూడదు.
ఒత్తిడికి (స్ట్రెస్‌ / యాంగై్జటీలకు) దూరంగా ఉండాలి. 

చికిత్స 
ఇది చాలావరకు నిరపాయకరమైనదీ, హానికలిగించని సమస్య కావడంతో దీన్ని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

అయితే సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అలర్జీలను ఎదుర్కొనే మందులైన కొన్ని డైఫిన్‌హైడ్రమైన్, యాంటీహిస్టమైన్‌ వంటి వాటితో  చికిత్స అందిస్తారు.

కొన్ని సందర్భాల్లో డాక్టర్లు ఫొటోథెరపీనీ సిఫార్సు చేయవచ్చు. ఇక సంప్రదాయ చికిత్సలుగా టీట్రీ ఆయిల్, అలోవీరా వంటి వాటిని పూయడం వల్ల కూడా కొంతమేర ప్రయోజనం, ఉపశమనం ఉంటాయి.  

చదవండి: Prostate Gland: ఈ గ్రంథి లేనట్లయితే సంతానమే లేదు.. బాదంకాయంత సైజు నుంచి అమాంతం ఎందుకు పెరుగుతుంది?

మరిన్ని వార్తలు