న్యూయర్‌ వేడుకలపై ఆంక్షలు.. అద్దెకు న్యూ ఇయర్‌ అడ్డాలు!  | Sakshi
Sakshi News home page

న్యూయర్‌ వేడుకలపై ఆంక్షలు.. అద్దెకు న్యూ ఇయర్‌ అడ్డాలు! 

Published Sun, Dec 26 2021 2:04 PM

HYD: Houses, Farm Houses Available To Rent For New Year Celebration - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించడంతో కొత్త సంవత్సర వేడుకలకు నగరవాసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదారుగురు స్నేహితులు బృందంగా ఏర్పడి ఫామ్‌ హౌస్‌లో పార్టీలకు ప్లాన్స్‌ చేస్తుంటే.. మరికొందరేమో గోవాలో న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధమవుతున్నారు. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించే పార్టీలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్‌ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్‌ హౌస్‌లు, వ్యక్తిగత గృహాలను యజమానుల నుంచి అద్దెకు తీసుకొని వ్యక్తిగత ఏర్పాట్లతో న్యూ ఇయర్‌ వేడుకలకు రెడీ అవుతున్నారు.

ప్రతి ఏడాది హోటళ్లు, పబ్, క్లబ్‌లే కాకుండా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు న్యూ ఇయర్‌ పార్టీలను నిర్వహిస్తుంటాయి. 2–3 నెలల ముందు నుంచే ప్రణాళికలు వేసుకునేవారు. పాపులర్‌ సింగర్స్, డీజేలు, మ్యూజిక్‌ డైరెక్టర్లు, సినిమా సెలబ్రిటీలతో ఈవెంట్లను నిర్వహిస్తుంటాయి. కరోనా కంటే ముందు కొత్త సంవత్సరం వేడుకలు నగరంలో 250కు పైగా జరిగేవి. ఈవెంట్‌ కోసం ప్రాంగణం దొరకడమే కష్టంగా ఉండేది. కానీ, గత రెండేళ్లుగా కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఆయా ఈవెంట్లు పెద్దగా జరగడం లేదు. ఈసారి ఒమిక్రాన్‌ వ్యాప్తి కారణంగా మరోసారి నిరుత్సాహామే ఎదురైందని ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వాహకులు తెలిపారు. సెలబ్రిటీలతో పెద్ద షోలు చేయాలంటే కనీసం నెల రోజుల ముందు నుంచి ప్లాన్‌ చేయాలి. 

సెలబ్రిటీల డేట్స్, విమాన టికెట్ల బుకింగ్స్, పబ్లిసిటీ, స్పాన్సర్‌షిప్‌ వంటి చాలా తతంగమే ఉంటుంది. అలాంటి వారం రోజుల వ్యవధిలో భారీ స్థాయిలో పెట్టుబడి ఆదాయం రాబట్టడం కుదిరేపని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ఈవెంట్‌ సైట్లలో ఒకట్రెండు ఈవెంట్లు కనిపిస్తున్నా.. పార్టీ ప్రియులు పెద్దగా ఆసక్తి  చూపడం లేదు. ఇదిలా ఉండగా.. మరోవైపు హోటళ్లు రూమ్స్‌కు ఎక్కువ చార్జీ వసూలు చేసి, గదికే ఫుడ్, వైన్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. ఇక  రేవ్‌ పార్టీలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం అందిన నేపథ్యంలో గట్టి నిఘా పెట్టామని సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

 ఫామ్‌ హౌస్‌ ఫర్‌ రెంట్‌
పబ్‌లు, క్లబ్‌లలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌పై పోలీసుల పరిమితుల నేపథ్యంలో పార్టీ ప్రియులు వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐదారు మంది స్నేహితులు బృందంగా ఏర్పడి. గేటెడ్‌ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి కొత్త సంవత్సర వేడుకలను ప్లాన్‌ చేస్తున్నారు. శివరాంపల్లి, శామీర్‌పేట, ఘట్‌కేసర్, కీసర, భువనగిరి, కొల్లూరు, గండిపేట, షాద్‌నగర్, హయత్‌నగర్‌ వంటి ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు చేరువలో ఉన్న శివారు ప్రాంతాల్లోని విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు న్యూ ఇయర్‌ వేడుకల కోసం అద్దెకు ఇస్తున్నారు. దీంతో చాలా మంది ఫామ్‌హౌస్‌లలో పార్టీలు చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్‌ తెలిపారు. రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్‌ ఇతరత్రా వాటిని కూడా ఫామ్‌హౌస్‌ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement