Nutritional Deficiency: పోషకాహార లోపంతో సతమతమవుతున్న చిన్నారులు.. రోజూ ఏం తినాలంటే..

13 Sep, 2023 10:48 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: మహిళలు, చిన్నారుల్లో పోషకాహార స్థితిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో పోషణ మాసోత్సవాన్ని చేపట్టారు. తద్వారా ఆరోగ్యకరంగా జీవించేందుకు బాటలు వేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నగరంతో సహా శివారు జిల్లాలైన మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డిలలో పోషకాల లోపంతో సతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. పోషకాలపై అవగాహన కల్పించి, పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పించే మాసోత్సవాన్ని పోషణ్‌ అభియాన్‌ పేరుతో ఈ నెలాఖరు వరకు ఆయా జిల్లా సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్నాయి.

ఇదీ లక్ష్యం..
స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ఈ నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలతో తల్లిదండ్రులను చైతన్యం చేస్తారు. పోషకాహార లోపం లేని తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గర్భిణులు మిటమిన్లు, ఐరన్‌ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం ఎలా తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు.

బహుమతుల ప్రదానం పోషణ మాసోత్సవంలో భాగంగా నగరంతో సహా శివారు జిల్లాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీల్లో పిల్లల ఎత్తు, బరువు చూస్తారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు బహుమతులు అందజేస్తారు. రక్తహీనత శిబిరాలు నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించటం వల్ల.. మాసోత్సవాల్లో ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నారులకు నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు పాలు, పండ్లు సూచిస్తున్నారు. యువజన, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు.

బరువు లేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోషణ మాసోత్సవాన్ని షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తున్నాం. చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మాసోత్సవం సజావుగా సాగేలా చూస్తున్నాం. వయస్సుకు తగ్గ బరువులేని చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తున్నాం. నిత్యం పాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై వారికి వివరిస్తున్నాం.

కృష్ణారెడ్డి, జిల్లా సంక్షేమాధికారి, మేడ్చల్‌–మల్కాజిగిరి.

మరిన్ని వార్తలు