ఒకే లాంటి మూడు హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే!

9 Oct, 2022 15:16 IST|Sakshi

అది 1984 జూలై 21, అమెరికాలోని మోంటానా.. రోసన్‌డన్‌ లోని సేక్రడ్‌ హార్ట్‌ క్యాథలిక్‌ చర్చి. అక్కడంతా ఫాదర్‌ జాన్‌ కెర్రిగన్‌(58) కోసమే వెతుకుతున్నారు. ముందురోజు రాత్రి 11 గంటలకు అతడ్ని చర్చ్‌కి ఎదురుగా ఉన్న బేకరీలో చూశామని, మాట్లాడామని, కాసేపట్లో వెళ్లి పడుకుంటాను అంటూ గుడ్‌నైట్‌ కూడా చెప్పారని కొందరు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఎంతసేపటికీ జాన్‌ ఆచూకి తెలియక పోవడంతో.. చర్చ్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆ వెంటనే విచారణ మొదలైంది. మరుసటి రోజు, ఫ్లాట్‌హెడ్‌ సరస్సు సమీపంలో హైవే వెంబడి రక్తంతో తడిసిన షర్ట్, షూస్, చలికోటు దొరికాయి. అవి కెర్రిగన్‌వే కావడంతో మిస్సింగ్‌ కేసు కాస్తా మర్డర్‌ కేసుగా మారిపోయింది. ఆ చోటంతా జల్లెడపట్టారు అధికారులు. అప్పుడే కోట్‌  హ్యాంగర్‌ ఒకటి కనిపించింది. దాన్ని కిల్లర్‌.. కెర్రిగన్‌ని బంధించడానికి లేదా గొంతు కోయడానికి ఉపయోగించి ఉంటాడని అంచనాకొచ్చారు. అయితే కెర్రిగన్‌ బాడీ మాత్రం దొరకలేదు.

సరిగ్గా వారం తర్వాత జూలై 29న, కెర్రిగన్‌ కారు రక్తపు మరకలతో కనిపించింది. కొద్ది అడుగుల దూరంలో కారు తాళం పడేసి ఉంది. డిక్కీ తెరిచే ఉంది. దానిలో పార, దిండుతో పాటు కెర్రిగన్‌ వాలెట్‌ కూడా రక్తంతో ముద్దయ్యాయి.

వాలెట్‌ నిండా డబ్బులుండటంతో.. ఈ నేరం డబ్బు కోసం జరగలేదని.. పగ, ప్రతీకారంతోనే జరిగిందని కేసు దర్యాప్తు అధికారులకు క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో 1982లో జరిగిన మరో ఇద్దరు చర్చ్‌ ఫాదర్స్‌ మిస్సింగ్‌ అండ్‌ మర్డర్‌ కేసులు మళ్లీ చర్చనీయాంశాలుగా నిలిచాయి. ఆ రెండు కేసులకి, ఫాదర్‌ కెర్రిగన్‌ అదృశ్యానికీ.. ఏదో సంబంధం ఉందనే అనుమానంతో.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. 

అంతకు ముందు ఏం జరిగింది?
1982 ఆగస్ట్‌ 7న న్యూ మెక్సికోలోని శాంటా ఫేలో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కేథడ్రల్‌ చర్చ్‌కి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘నా పేరు మైకేల్‌ కార్మెల్లో, చావుబతుకుల మధ్య ఉన్న మా తాతకు ఎక్స్‌ట్రీమ్‌ అంక్షన్‌(క్యాథలిక్‌ మతకర్మల ప్రకారం తీవ్ర అనారోగ్యానికి గురైనవారి కోసం, చివరి దశలో ఉన్న వృద్ధుల కోసం చర్చ్‌ ఫాదర్స్‌ ప్రార్థనలు చేస్తారు) ఇవ్వాలని కోరాడు.

మొదట ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన ఓ ఫాదర్‌.. నాకు వీలుపడదు కానీ..మరో పదిహేను నిమిషాలు ఆగి కాల్‌ చేయమని చెప్పాడు. సరిగ్గా పదిహేను నిమిషాలకి ఆ అజ్ఞాత వ్యక్తి కాల్‌ చేశాడు. ఈసారి ఫోన్‌ లిఫ్ట్‌ చేíసిన.. రెనాల్డో రివెరా(57) అనే ఫాదర్‌ ఆ అజ్ఞాత వ్యక్తి కోరికను కాదనలేకపోయాడు. వస్తానని అతడికి మాటిచ్చాడు. ఎక్కడికి రావాలని రివెరా అడిగితే.. ‘న్యూ మెక్సికోలోని వాల్డో సమీపంలో రెస్ట్‌ స్టాప్‌లో ఉంటాం’ అని వివరాలు చెప్పాడు ఆ వ్యక్తి. దాంతో రివెరా వాల్డోకు వెళ్తునట్లు చర్చ్‌ మఠాధిపతికి సమాచారం ఇచ్చి చర్చ్‌ నుంచి బయలుదేరాడు.

ఆ తర్వాత అతడు తిరిగి రాలేదు. సరిగ్గా మూడు రోజుల తరువాత, ఫాదర్‌ రివెరా మృతదేహం రెస్ట్‌ స్టాప్‌ నుంచి మూడు మైళ్ల దూరంలో బయటపడింది. కాస్త దూరంలో కారు కూడా దొరికింది. ఫాదర్‌ కెర్రిగన్‌ అదృశ్యానికి, ఫాదర్‌ రివెరా హత్యకు మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరి కార్లూ నేరస్థలానికి దూరంగానే విడిచారు. రెండు కేసుల్లోనూ కోట్‌ హ్యాంగర్స్‌ కామన్‌గా నిలిచాయి. అవి కూడా ఒకే కంపెనీకి చెందినవి. ఇన్ని సరిపోలిన తర్వాత రెండు హత్యలకు సూత్రధారులు ఒక్కరనే నమ్మకానికి వచ్చేశారు పోలీసులు. పైగా ఈ హత్యలకు క్యాథలిక్‌ వ్యతిరేకవర్గాలే ప్రేరణగా నిలుస్తున్నాయని.. చాలా మంది నమ్మారు. అయితే అందుకు సరైన ఆధారాలు లభించకపోవడంతో ఆ ఊహాగానాలను పోలీసులు కొట్టి పడేశారు.

రివెరాతో ఫోన్‌లో మాట్లాడిన.. మైకేల్‌ కార్మెలో అనే వ్యక్తి కోసం పోలీసులు ఓ రేంజ్‌లో వేట మొదలుపెట్టారు. మోంటానా రాష్ట్ర సైనికుల సాయం కూడా తీసుకున్నారు. హత్యలో కనీసం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని చాలామంది భావిస్తున్నారు. కొందరు అనుమానితుల్ని పట్టుకుని నిలదీశారు. స్థానికంగా కొందరు యువకుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

అయినా ఎలాంటి ఆధారం దొరకలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఆగస్ట్‌ 8న చివరిసారిగా ఫాదర్‌ కెర్రిగన్‌ను చూశామని తేలడంతో.. అసలు కెర్రిగన్‌ చనిపోలేదా? బతికే ఉన్నాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. పైగా 1982లో మిస్‌ అయిన మరో ఫాదర్‌ జేమ్స్‌ ఓటిస్‌ ఆండర్సన్‌.. కెర్రిగన్‌ స్నేహితుడే కావడం కూడా ఈ కథలో రక్తికట్టించే అంశమే.

మరో ఫాదర్‌ కథ?
జేమ్స్‌ ఓటిస్‌ 1982 జూన్‌ 13న మోంటానాలోని టౌన్‌సెండ్‌లోని హైవే 12వైపు కారులో వెళ్తూ కొందరికి కనిపించాడు. అదే చివరిసారి. ఆ తర్వాత అతడి కారు టౌన్‌సెండ్‌కు ఈశాన్యంలో ఉన్న బిగ్‌బెల్ట్‌ పర్వతాలలో పెద్దపెద్ద చెట్ల మధ్య దొరికింది. అతడి భార్య.. జేమ్స్‌కి డ్రైవింగ్‌ అంతగా రాదని.. అలాంటి పర్వతాల మధ్య అస్సలు డ్రైవ్‌ చేయలేడని చెప్పింది.

దాంతో అప్పట్లో.. కారు ఎవరో కావాలనే అక్కడికి తీసుకుని వెళ్లారనే కోణంలో విచారణ చేశారు. అలాగే ఆ పరిసర ప్రాంతాలను క్షుణంగా పరిశీలించగా.. జేమ్స్‌కి సంబంధించిన బైబిల్స్, కళ్లజోడు, టోపీ, క్లరికల్‌ కాలర్‌ ఇలా చాలా వస్తువులు దొరికాయి. కానీ జేమ్స్‌ మాత్రం దొరకలేదు.

కెర్రిగన్‌ మిస్సింగ్‌ తర్వాత.. పోలీసులు ఈ మూడు కేసుల్ని చాలెంజింగ్‌గా తీసుకున్నారు. కానీ ఎలాంటి క్లూస్‌ లభించలేదు. అయితే 2015లో రోమన్‌ క్యాథలిక్‌ డియాసెస్‌ ఆఫ్‌ హెలెనా నిర్వహించిన సర్వే ఒకటి బయటికి వచ్చింది. అందులో పశ్చిమ మోంటానాలో పిల్లలను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఎనభై మంది మాజీ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి.

వారిలో ఫాదర్‌ కెర్రిగన్‌ ఒకడు. ఒక్కసారిగా కేసు ఆ దిశగా తిరిగింది. లైంగిక వేధింపులతో సంబంధం ఉండటం వల్లే ఆ బాధితుల్లో ఎవరో చంపేసి ఉంటారని ఊహాగానాలు పుట్టు కొచ్చాయి. అయితే కొందరు పరిశోధకులు ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. ఏదిఏమైనా కెర్రిగన్, జేమ్స్‌లు ఎప్పుడూ, ఎవరికీ కనిపించ లేదు. కనీసం మృతదేహాలు కూడా కానరాలేదు. మరి ముగ్గురి అదృశ్యానికి, మరణానికి ఒక్కడే సీరియల్‌ కిల్లర్‌ కారణమా? లేక వేరువేరు కథలను కన్ఫ్యూజన్‌తో పోలీసులు ఏకం చేయడానికి ప్రయత్నించారా? అనేది నేటికీ మిస్టరీగానే ఉంది.
 ∙సంహిత నిమ్మన 

మరిన్ని వార్తలు