Size Zero: జీరో మోజులో.. జీరో కావద్దు

3 Oct, 2021 07:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘నేడు ప్రపంచంలో ఎంతోమంది మహిళలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం దొరకక కాదు. కచ్చితమైన శరీర కొలతల చట్రంలో ఇమడటానికి’ అనే విషయాన్ని మిరాసోల్‌ ఈటింగ్‌ డిజార్డర్‌ రికవరీ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచంలో దాదాపు 69 మిలియన్ల మంది మహిళలు సమాజం విధించిన కొలతల చట్రంలో తమ శరీరాన్ని ఉంచడానికి పొట్ట మాడ్చుకుంటున్నారని,  ఫలితంగా వారు అనొరెక్సియా వంటి ప్రమాదకర ఆరోగ్యసమస్యల బారినపడుతున్నారని తమ నివేదికల ద్వారా తెలియజేసింది.

ఇటీవల బాలీవుడ్‌ నటి శ్వేతా తివారి షూటింగ్‌ జరుగుతున్న సమయంలో సృహ తప్పిపడిపోయి, ఆసుపత్రిలో చేరింది. కొన్ని రోజుల్లోనే ఏకంగా పది కేజీల బరువు తగ్గిన శ్వేత తాను తీసుకున్న ఆహార నియమాల వల్లే ఆసుపత్రి పాలైందని తెలుస్తుంది. సాధారణంగా పురుషుడు అంటే శారీరకంగా దృఢంగా ఉంటాడు. స్త్రీ అంటే సున్నితంగా, సన్నగా ఉంటుంది అనేది సర్వత్రా అందరిలోనూ ఉన్న ఆలోచన. అమ్మాయిలు నాజూకుగానే ఉండాలనే విషయంలో స్లిమ్, జీరోసైజ్, కచ్చితమైన శరీర కొలతల కోసం చేసే ప్రయోగాలు వారి ప్రాణాల మీదకు తెస్తూనే ఉన్నాయి. 

సామాజిక మాధ్యమాల్లో ...
జీరోసైజ్‌ ఫిగర్, పర్ఫెక్ట్‌ ఫిగర్, అమ్మాయి శరీరం వంపులుగా ఉండాలి, బండగా ఉంటే బాగుండదు.. వంటి బాడీ ఇమేజ్‌ కామెంట్లు సోషల్‌ మీడియా ద్వారా మన ఇంటి డైనింగ్‌ టేబుల్‌ నుంచి టాయిలెట్‌ వరకు చేరుకుంటున్నాయి. ఇటీవల 40 ఏళ్ల శ్వేత తివారీ తన ఫొటోషూట్‌ని సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ఆమె గతంలో కన్నా చాలా సన్నగా, కొత్త స్టైల్‌లో కనిపించింది. ఇలా నాజూకు బొమ్మలా కనిపించే ‘గ్లామర్‌ డాల్స్‌’ ఎంతోమంది నేటి అమ్మాయిలకు ‘సన్న’బడాలనే విషయంలో ప్రేరణగా నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే చిత్రాల్లో మరింత స్లిమ్‌గా కనిపించాలనే తాపత్రయం సన్నగా మారడానికి ప్రయోగాలు చేసే దిశగా మళ్లిస్తుందన్నది నిజం. తమ ‘జీరో సైజ్‌’ ఫొటోలకు ఎన్ని లైక్‌లు, షేర్‌లు వస్తే అంత గొప్పగా భావించేవారూ ఎక్కువయ్యారు. వయసును దాచడానికి కూడా ‘సన్న’బడటం ఒక ప్రామాణికంగా మారింది. ‘కచ్చితమైన కొలతల్లో ఉండాలనే భారం ఎంతో మంది అతివల మీద మోయలేనంతగా పెరిగిపోయింది. ఫలితంగా నవ్వడం, ఆడటం, తినడం, తాగడం వంటివి కూడా కేలరీలలో లెక్కించడం ప్రారంభిస్తున్నారు. చివరకు ప్రమాదకరమైన వ్యాధులకు లోనవుతున్నారు’ అంటున్నారు మానసిక నిపుణులు. 

ఆ అవగాహన అగమ్యం
ఒకప్పుడు సినిమా రంగానికే పరిమితమైన గ్లామర్‌ ఈ నవ లోకంలో చాలా మంది యువతను చుట్టుముట్టేసింది. అందుకు తగినట్టుగానే డిజిటల్‌ మీడియా అందించిన రెక్కలతో యువత కొత్తగా విహరిస్తోంది. బాలీవుడ్‌ నటి రిచా చద్దా ఒక ప్రదర్శనలో అందం గురించి మాట్లాడుతూ ‘నేను గతంలో అందం ప్రమాణాలలో ఎంతగా మునిగిపోయానంటే, తిన్న ఆహారం వాంతులు చేసుకోవడమే దినచర్యగా ఉండేది. చాలా కాలం తర్వాత కోలుకోగలిగాను’ అని వివరించింది. ప్రిన్సెస్‌ డయానా కూడా ఈ సమస్యతో బాధపడిందని, అనొరెక్సియా వ్యాధికి గురైందని బ్రిటీష్‌ కుటుంబ జీవిత ఆధారంగా ‘ది క్రౌన్‌’ సీరిస్‌లో తెలియజేశారు. చాలా మంది సినీతారలు తాము తీసుకునే ఆహారంలో వారి శరీరానికి తగినట్టు పోషకాహారనిపుణుల సూచనలు పాటిస్తుంటారు. అవేమీ తెలియని దిగువ, మధ్యతరగతి మగువలు ‘సన్న’గా ఉండాలంటే తినే తిండి సగానికి పైగా తగ్గించేయాలనుకుంటున్నారు. ఇక బులీమియా అనే సమస్యకు లోనయినవారు ఆకలికి తట్టుకోలేక తిన్నా, ఆ తిన్నదానిని బలవంతంగా వాంతి చేసుకోవడానికి గంటలు గంటలు టాయిలెట్లలో గడుపుతుంటారు. ఫలితంగా బలహీనత, రక్తహీనత, రుతుక్రమ సమస్యలు, రకరకాల ఆందోళనలతో గడుపుతూ చివరకు డిప్రెషన్‌  బారిన పడే అవకాశమూ ఉంది.

నివేదికల్లో స్పష్టం
ఈటింగ్‌ డిజార్డర్స్‌పై పనిచేస్తున్న మిరాసోల్‌ అనే అంతర్జాతీయ సంస్థ నివేదిక ప్రకారం 43 మిలియన్ల మంది మహిళలు తాము తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండాలనుకుంటున్నారు. 26 మిలియన్ల మహిళలు తమ శరీర ఆకృతిని ఏవిధంగానైనా కాపాడుకోవాలి అనుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 69 మిలియన్ల మంది మహిళలు తమ శరీరం ఒక కొలతల చట్రంలో ఉంచడానికి ఆకలితో ఉంటున్నారు. ప్రపంచంలో పురుషుల్లో కేవలం 0.3 శాతం మందిలోనే రక్తహీనత ఉంటే, ఇది మహిళల్లో ఒక శాతం ఉంది. 15 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో ఈ ప్రభావం అధికంగా ఉందనే విషయాలను కూడా ఈ సంస్థ స్పష్టం చేసింది. 

‘చిన్న వయస్సు నుండే మహిళలు సన్నగా, కొలతల ప్రకారంగా ఉన్న చిత్రాలలోని మహిళలను చూసి, అదే స్థిరమైన శరీర ఇమేజీగా మనస్సుల్లో ముద్రించుకుంటున్నారు. ఈ ప్రక్రియ వల్ల చాలా సార్లు స్వీయహింసకు గురవుతున్నారు. అమ్మాయిల్లో ‘జీరో సైజ్‌’ సమస్య పెరుగుతున్న ఈ కాలంలో వారిని ఆ ప్రభావం నుంచి బయట పడేయడానికి కుటుంబసభ్యులు, మిత్రుల సాయం తప్పనిసరి. పోషకాహార నిపుణులు, మానసిక నిపుణుల సాయంతో ‘కొలతల్లో ఇమిడిపోవాల’నే ఆలోచనను అధిగమించవచ్చు’ అంటున్నారు నిపుణులు. 

మరిన్ని వార్తలు